తెలుగు రాష్ట్రాల్లో... వేసవి కాలంలో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరుగుతాయి. కల్యాణ మండపాలు, ప్రముఖ దేవాలయాలు వేదికలుగా పెళ్లిళ్లు జరిగేవి. అయితే వచ్చిపోయే అతిథులతో అంతట హడావుడి కనిపించేది. కరోనా కారణంగా ఉభయ రాష్ట్రాల్లో... వేలాది వివాహాలు వాయిదా పడ్డాయి. మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. నిత్యావసరాలు, అత్యవసర పనుల మీద బయటకు వచ్చినా.. భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బంధుమిత్రులను ఆహ్వానించి శుభకార్యాలు నిర్వహించలేని పరిస్థితి. కనీసం రెండు కుటుంబాలు కలిసి తంతు ముగించే పరిస్థితి కనిపించడంలేదు.
కర్నూలు జిల్లాలో సుమారు 250 కల్యాణ మండపాలు ఉన్నాయి. వివాహాల కోసం ఆరు నెలల ముందుగానే అడ్వాన్సులు చెల్లించేశారు. ఒక్క కర్నూలు నగరంలోనే 96 ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. ఇవ్వన్నీ గత రెండు మాసాల్లో జరగాల్సిన వివాహాలకు ఇవన్నీ బుక్ అయ్యాయి. కరోనా దెబ్బతో ఫంక్షన్ హాళ్లు మూతబడడం వల్ల అడ్వాన్సులు వెనక్కు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.