Fuel Prices Effect: చమురు ధర చుక్కల దిశగా పరుగుతీస్తోంది.. అన్ని రంగాలకు ఇంధన భారం ఇరకాటంగా మారింది... నిత్యం మారిపోతున్న రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక, రవాణా అవసరాలకు విరివిగా వినియోగించే డీజిల్ ప్రభావం అనేక ఉత్పత్తులపై పడుతోంది. వ్యవసాయ రంగాన్నే చూస్తే.. దమ్ములు చేయడానికి ట్రాక్టర్ కిరాయి మొదలు... పండిన పంటను రవాణా చేయడం వరకు అన్ని దశల్లోనూ అన్నదాతకు భారీగా చేతిచమురు వదులుతోంది. సంచి లాభం చిల్లి తీసిందన్నట్లు.. పెరిగిన ఖర్చులు రైతుకు వచ్చే అరకొర రాబడికీ గండి కొడుతున్నాయి. రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు ముడి సరకైన పాలిమర్స్ పెట్రో ఉప ఉత్పత్తుల కిందకే వస్తాయి. వీటి ధరలు కూడా అమాంతం రెట్టింపై.. పరిశ్రమలు మూతపడే స్థాయిలో భయపెడుతున్నాయి. ప్లాస్టిక్, ఇంజినీరింగ్, సిమెంటు, వైద్య, ఆరోగ్య ఉత్పత్తులు, పరికరాల తయారీకి పాలిమర్స్ ధరలు అశనిపాతంగా మారాయి. చమురు ధరలు భగ్గుమంటుండడంతో ఆటోలు, క్యాబ్ డ్రైవర్ల జీవనం దయనీయంగా మారింది. కరోనా కొట్టిన దెబ్బకు ఇంకా కోలుకోలేకపోయిన వారు ఇప్పుడు తమ వాహనాలను తెగనమ్ముకుని.. కూలీనాలీ పనులకు మళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
సాగు తడిసి మోపెడు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలో వరికోత కోస్తున్న యంత్రమిది. గంటసేపు వరికోత కోయడానికి రెండేళ్ల క్రితం రూ.1800 నుంచి రూ. 2400 తీసుకునేవారు. ఇప్పుడు రూ.2500 నుంచి రూ. 3500 దాకా వసూలు చేస్తున్నారు.
చిన్న పరిశ్రమ కుదేలు:హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ ఇరవైఏళ్ల కిందట చిన్నతరహా పరిశ్రమను స్థాపించి స్వయం ఉపాధి పొందుతున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేసి విద్యుత్ సంస్థలకు విక్రయిస్తున్నారు. పాలిమర్ ఇతర ముడిసరకుల ధరలు పెరగడంతో ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. గత నెల రోజుల్లోనే దాదాపు 40 శాతం మేర ధరలు పెరగడంతో ఆదాయం తగ్గింది. కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో పరిశ్రమ మూసివేతే శరణ్యమని వాపోతున్నారాయన.
యజమాని డ్రైవరయ్యాడు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన రవీంద్రనాయక్ తన దగ్గరున్న రెండు వాహనాలను కిరాయికి తిప్పేవారు. ఇప్పుడు ఆదాయం చాలక నష్టాలొస్తుండడంతో వాటిని అమ్మేసి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ‘వచ్చే ఆదాయం ఖర్చులకే పోతుండటంతో ఆటో వదిలేసి సొంత ఊరు వెళ్లిపోయా’ అని సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి చెందిన భిక్షపతి చెప్పారు. ‘ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి కారు నడిపా. ఇప్పుడు దాన్ని అమ్మేసి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నా’నని సంగారెడ్డి జిల్లా కోడూరుకు చెందిన నర్సింహ తెలిపారు.
పరిశ్రమలపై పిడుగుపాటు.. ఇంధన ధరల పెరుగుదల పారిశ్రామిక రంగంపై పిడుగుపాటుగా మారింది. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఛార్జీలు పైకి ఎగబాకుతుండగా, పరిశ్రమల్లో ముడిపదార్థంగా భారీ స్థాయిలో వినియోగించే పెట్రో ఉప ఉత్పత్తి పాలిమర్ ధరలు రెట్టింపయ్యాయి. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం నెలకొంది. వ్యవసాయం, వాహనాల తయారీ, ఆహారశుద్ధి, సిమెంటు, ఆరోగ్య సంరక్షణ, ఔషధ, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, ప్యాకేజింగ్ తదితర పరిశ్రమలకు పాలిమర్స్ తప్పనిసరి. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని చమురు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. పెట్రోలు, డీజిలు ధరల కంటే పాలిమర్స్ ధరలు మరింతగా భగ్గుమంటున్నాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగి, వినియోగదారులపైనా భారం పడుతోంది. తెలంగాణలో 18,302 ఇంజినీరింగు, 12,023 ప్లాస్టిక్ పరిశ్రమలున్నాయి. వీటితో పాటు ఇంధన ఉత్పత్తులపై ఆధారపడి మరో పదివేల ఇతర పరిశ్రమలు నడుస్తున్నాయి. వీటిలో మూడున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. పాలిథిన్ సంచులు, గ్లాస్లు, పైపులు సహా ఆరున్నర వేలకు పైగా వస్తువులు, పరికరాలు తయారవుతున్నాయి. ఉత్పాదక వ్యయం పెరిగేకొద్దీ వస్తు, ఉత్పత్తుల ధరలూ పెరిగి ఆ ప్రభావం వినియోగదారులపైనే పడుతోంది.
ప్రధాన రంగాలకు దెబ్బ:ఏబీఎస్ రకం పాలిమర్ కిలో ధర 2015లో రూ. 144 ఉండగా... ప్రస్తుతం రూ. 340కి ఎగబాకింది. ఈ ధర నెలనెలా పెరుగుతూనే ఉంది. పీవీసీ, సీపీ, హెచ్డీపీఈ, ఎల్ఎల్డీపీఈ, పీపీ, జీపీపీఎస్, హెచ్పీపీఎస్, పీపీసీపీ, ఎల్‌డీపీఈ, పీఈటీ తదితర 11 రకాల పాలిమర్ ధరలు 50-80 శాతం వరకు పెరిగాయి. వైద్య ఆరోగ్యం, ఔషధ రంగాల్లో పాలిమర్ ధరాభారం వల్ల ఉత్పత్తులు తగ్గిపోయాయి. వ్యవసాయరంగానికి అవసరమైన పైపులు, ఇతర పరికరాల ఉత్పత్తి మందగించింది. బొమ్మల తయారీ దాదాపుగా నిలిచిపోయింది. చాలా పరిశ్రమల్లో ఉత్పత్తులు 50 శాతమే జరుగుతున్నాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాలకు జరిగే ఎగుమతులు తగ్గాయి. రవాణా ఛార్జీలు గతంలో టన్నుకు రూ. 5-10 వేల వరకు ఉండేవి. చమురు ధరలకు అనుగుణంగా ఇప్పుడు వాటిని ఏకంగా రూ.10-15 వేలకు పెంచారు.
పారిశ్రామికవేత్తలపై భారం..ఇంధన, వాటి అనుబంధ సరకుల ధరల్లో భారీ పెరుగుదలతో పారిశ్రామికవేత్తలు కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. ఉత్పత్తులు సరిగా రాక మార్కెట్లో విక్రయాలు తగ్గిపోయాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రధానంగా భారత్‌లో సమస్య దృష్ట్యా ఎగుమతులను నిలిపివేసి దేశీయ పరిశ్రమలకు చేయూతనివ్వాలి. ముడిసరకుల ధరల నియంత్రణకు పెట్రోలియం ఉత్పత్తుల నియంత్రణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. - సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య