తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ డబ్బు సమకూర్చేదెవరు? రామచంద్రభారతికి సిట్‌ ప్రశ్నల వర్షం - accused voice samples collected in MLA buying case

తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ పూర్తయింది. నిన్న, ఈరోజు నిందితులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. కస్టడీ గడువు ముగియడంతో ముగ్గురినీ అ.ని.శా. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా నిందితుల బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ముగ్గురు నిందితులకు ఈ నెల 25 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం ముగ్గురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

రెండోరోజూ 'ఎమ్మెల్యేల ఎర కేసు' విచారణ.. నిందితుల స్వర నమూనాల సేకరణ
రెండోరోజూ 'ఎమ్మెల్యేల ఎర కేసు' విచారణ.. నిందితుల స్వర నమూనాల సేకరణ

By

Published : Nov 11, 2022, 5:16 PM IST

Updated : Nov 11, 2022, 7:35 PM IST

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ విచారణ ముగిసింది. నిన్న రాజేంద్రనగర్‌ ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు నిందితులను ప్రశ్నించిన సిట్‌ అధికారులు ఇవాళ కూడా అక్కడే ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్వర నమూనాలు సేకరించిన అధికారులు.. భిన్న కోణాల్లో వారిని విచారించారు. ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వాంగ్మూలం కీలకం కానుందని సిట్‌ భావిస్తోంది. దిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్‌ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాననడంతో.. ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదే అంశంపై సిట్‌ ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలతో ఫామ్‌హౌస్‌లో బేరసారాలపై నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నించినప్పుడు చాలా వరకు తమకు తెలియదనే సమాధానం వచ్చినట్టు తెలిసింది. నిందితులను విచారిస్తున్న రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌.. విచారణ జరుగుతున్న తీరును పరిశీలించారు. రెండ్రోజుల సిట్‌ విచారణ ముగిసిన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఈ నెల 25 వరకు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ముగ్గురు నిందితులను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

Last Updated : Nov 11, 2022, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details