హైదరాబాద్.. ఇతర నగరాలు, పట్టణాల్లో విదేశీ పండ్ల విక్రయాలు ఇటీవల పెరుగుతున్నాయి. ప్రజలు ఆసక్తితో కొంటున్నారు. అవే పండ్లను తెలంగాణలోనే పండించేందుకు ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే థాయ్‌లాండ్ జామ పండ్ల సాగుతో సత్ఫలితాలు రావడం వల్ల అదే దేశానికి చెందిన ‘థాయ్ పింక్ పండ్లు’ పండించాలని ఏర్పాట్లు చేస్తోంది.
కశ్మీరీ ఆపిల్ బేర్...
వీటిని మనదేశంలో కశ్మీరీ ఆపిల్ బేర్‌గా పిలుస్తున్నారు. ‘తెలంగాణ లాల్ సుందరి’ అనే బ్రాండు పేరు పెట్టి వీటిని అమ్మేలా పంట సాగు చేయించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో సాగవుతున్న ఆకుపచ్చని ఆపిల్ బేర్ పండ్లలా ఉండే థాయ్ పింక్ పండ్లను పండించేందుకు 5 వేల తల్లి మొక్కలను థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. సిద్దిపేట జిల్లా ములుగులో ఈ శాఖకు చెందిన పంటల ప్రయోగ క్షేత్రంలో ఈ మొక్కలు నాటి సాగుకు ఉద్యానశాఖ ఏర్పాట్లు చేపడుతోంది. ఆసక్తిగల రైతులకు 3 వేల మొక్కలు ఇచ్చి సాగు చేయించి ఇతరులకు చూపాలని నిర్ణయించింది.
తొలిసాగు...
భద్రాద్రి జిల్లా సారపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన కె.రాజు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పంటను తొలుత సాగు చేశారు. గతంలో ఆకుపచ్చని ఆపిల్ బేర్ పంట సాగు చేసి లాభాలు గడించారు. గత మే నెలలో తెలంగాణ లాల్ సుందరి పండ్ల సాగు ప్రారంభించారు. ఎకరానికి రూ.20వేల చొప్పున కౌలు చెల్లించి ఐదెకరాల్లో సాగు ప్రారంభించారు. మొక్కకు రూ.250 వెచ్చించి బంగ్లాదేశ్ నుంచి తెప్పించారు.