తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవికాలంలో సత్వర శక్తినిచ్చే ఆరోగ్య రసాలు! - PRECAUTIONS IN SUMMER

ఎండాకాలం.. శరీరం చెమట రూపంలో లవణాలని వేగంగా కోల్పోతుంటుంది.. దాంతో మనలో నీరసం, నిస్సత్తువ ఆవరించడంతో పాటు జీవక్రియల వేగం కూడా తగ్గుతుంది. అలాగని రుచీపచీ లేని నీళ్లని తాగలేం అంటారా? అయితే రోజంతా హుషారుగా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన పండ్ల రసాలని ప్రయత్నించండి...

FRUIT JUICES FOR INSTANT ENERGY IN SUMMER
వేసవికాలంలో సత్వర శక్తినిచ్చే ఆరోగ్య రసాలు!

By

Published : Apr 14, 2020, 1:39 PM IST

ఎండ, వేడి... చెమట కారణంగా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ పడిపోతూ ఉంటాయి. అలా పడిపోయినప్పుడు మనలో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఈ లోటును భర్తీ చేయడానికి పళ్లరసాలు చక్కని ఎంపిక. ఈ పండ్ల రసాల్లో మన శరీరానికి కావాల్సిన మూలకాలు, ఎలక్ట్రోలైట్స్‌ (పొటాషియం, మెగ్నిషియం, సోడియం, క్లోరైడ్‌) ఉంటాయి. ఇవి జీవక్రియల పనితీరును మెరుగుపరుస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి.

తర్బూజ...

లాభాలు

*ఈ రసాన్ని తాగితే ఎండ వేడి వల్ల మూత్రంలో వచ్చే మంటను తగ్గించుకోవచ్ఛు అంతేకాదు ఈ నీళ్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. మలబద్ధకం సమస్య ఉత్పన్నం కాదు. ఈ జ్యూస్‌లో విటమిన్‌-ఎ, సిలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. చర్మానికి, పేగులకు మంచిది. ఎసిడిటీ, అల్సర్స్‌ తగ్గుముఖం పడతాయి. ఊబకాయులు, మధుమేహం ఉన్నవారు తీసుకోవచ్ఛు బాలింతలు తాగితే పాలు సమృద్ధిగా పడతాయి.

కావాల్సినవి:తర్బూజ ముక్కలు - 250 గ్రా., జీలకర్ర పొడి - అర చెంచా, సైంధవ లవణం - పావు చెంచా, ఎండిన దానిమ్మ గింజల పొడి - పావు చెంచా, చక్కెర - చెంచా, నీళ్లు - సరిపడా.

తయారీ: తర్బూజ ముక్కల్లో సైంధవ లవణం, ఎండిన దానిమ్మ గింజల పొడి వేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమంలో కొన్ని నీళ్లు పోసి, చక్కెర, జీలకర్ర వేసి బాగా కలపాలి. అంతే తర్బూజ పండు రసం తయారైపోయినట్లే.

పుచ్చకాయతో...

కావాల్సినవి: చెక్కు తీసిన పుచ్చకాయ ముక్కలు - కప్పు, నిమ్మరసం - అర చెంచా, పంచదార/ తేనె - రుచికి సరిపడా, నీళ్లు - గ్లాసు.

తయారీ: మొదట మిక్సీలో పుచ్చకాయ ముక్కలు వేయాలి. ఇందులో పంచదార, నిమ్మరసం, నీళ్లు కలిపి బ్లెండ్‌ చేసుకోవాలి. ఆ తరువాత వడకట్టుకుంటే పుచ్చకాయ జ్యూస్‌ రెడీ!

లాభాలు

*90 శాతం నీరుండే పుచ్చకాయలో విటమిన్‌-సి, రైబోఫ్లెవిన్‌ అధికంగా ఉంటాయి. దీనిలోని పీచు జీర్ణక్రియకు సాయపడుతుంది. పేగుల పూతను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కటి ఎంపిక. వంద గ్రాముల పుచ్చకాయ నుంచి 17 కెలొరీల శక్తి లభిస్తుంది.

*పుచ్చకాయ రసంలో తేనె లేదా పంచదార వేసి తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తితోపాటు విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. ఈ రసం మూత్ర సంబంధ సమస్యలతోపాటూ ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలనూ తగ్గిస్తుంది.

*పుచ్చకాయ రసంలో జీలకర్ర వేసి తీసుకుంటే మూత్రంలో వచ్చే మంట తగ్గుతుంది. కొందరిలో పుచ్చకాయ తినడం వల్ల కఫం ఏర్పడవచ్ఛు అలాంటివారు ఈ రసంలో కాస్తంత నల్ల ఉప్పు లేదా సైంధవ లవణం కలిపి తీసుకోవాలి.

పచ్చిమామిడికాయతో..

కావాల్సినవి:మామిడికాయ ముక్కలు - 250 గ్రా., పంచదార - 750 గ్రా., యాలకులు - రెండు, కుంకుమపువ్వు - చిటికెడు, నీళ్లు - నాలుగు కప్పులు.

తయారీ:మామిడికాయలను శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి మామిడికాయ ముక్కలను ఉడికించాలి. ఆ తరువాత పంచదార వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. ఆ తరువాత దీంట్లో యాలకులు, కుంకుమ పువ్వు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ రసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నంపూట తాగితే శరీరానికి చలువ చేస్తుంది.

లాభాలు

*● మామిడికాయ రసాన్ని ‘ఆమ్‌ పన్నా’ అని పిలుస్తారు. ఇది శరీరానికి చలువ చేస్తుంది. దప్పికను తీరుస్తుంది. మామిడికాయలో విటమిన్‌-సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిగుళ్ల నొప్పి, గొంతుపూతను తగ్గిస్తుంది. ఈ రసంలో చిటికెడు నల్ల ఉప్పు, ఎండిన అల్లం పొడి, కాస్తంత జీలకర్ర కలిపి తీసుకుంటే పైత్యంతో వచ్చే వాంతులు తగ్గుతాయి. దీన్ని ‘కట్టామీటా కైరికి పన్నా’ అని పిలుస్తారు. దీనిలో ఉండే పెక్టిన్‌ అనే పదార్థం అజీర్తిని తగ్గిస్తుంది.

*మామిడికాయలో తీపి తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తినొచ్చు.

నిమ్మకాయతో...

కావాల్సినవి: నిమ్మకాయ - అర ముక్క, వంటసోడా - పావు చెంచా, నీళ్లు - తగినన్ని.

తయారీ:గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ ముక్క రసాన్ని, కొద్దిగా వంటసోడాను కలిపి నిమ్మరసాన్ని తయారుచేసుకోవాలి. ఈ నీటిని ఉదయంపూట పరగడుపున తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవదు. ఈ కాలంలో రోజూ నిమ్మరసం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి. మలబద్ధకం సమస్య ఉండదు.

లాభాలు

*వందగ్రాముల నిమ్మపండు నుంచి 29 కెలొరీల శక్తి లభిస్తుంది. రోజూ అర కప్పు నీటిలో సగం ముక్క నిమ్మరసం, చిటికెడు వంటసోడా కలిపి తాగితే కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది.

*ఈ నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. శరీరానికి నీరు పట్టకుండా ఉండి వాపు తగ్గుతుంది.

*నిమ్మరసంలో విటమిన్‌-సితోపాటు బి6, బి1, బి2 ఉంటాయి. పొటాషియం కూడా లభ్యమవుతుంది.

*మజ్జిగలో నిమ్మరసం, అల్లం వేసుకుని తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది.

*నిమ్మ ఆకులను మజ్జిగలో వేసి తాగితే సువాసనతోపాటు ఆకలి పెరుగుతుంది.

దబ్బపండు

కావాల్సినవి:దబ్బపండు రసం - కప్పు, పంచదార - మూడు కప్పులు, యాలకులు - నాలుగైదు.

తయారీ:దబ్బపండును వేడినీటిలో వేసి కాసేపటి తరువాత రసం తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇందులో చక్కెర వేసి అది మునిగేలా నీళ్లు పోసి తీగపాకం వచ్చేవరకు కలపాలి. దీంట్లోనే యాలకులను వేయాలి. పాకం చల్లారిన తరువాత దబ్బపండు రసం కలపాలి. కొన్నిరోజులపాటు నిల్వ ఉండాలనుకుంటే అర చెంచా సిట్రిక్‌ యాసిడ్‌ను కలపొచ్ఛు శుభ్రమైన కంటైనర్‌లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే 15 రోజులపాటు నిల్వ ఉంటుంది. కావాలనుకున్నప్పుడు గ్లాసు నీటిలో రెండు మూడు చెంచాల సిరప్‌ కలిపి తాగొచ్చు.

లాభాలు

*దీన్ని గజ నిమ్మ పండని కూడా పిలుస్తారు. దబ్బకాయ షర్బత్‌ తాగితే వాంతులు, దప్పిక, నోటిపూత, చిగుళ్ల వాపులు తగ్గిపోతాయి.

*చెంచా చొప్పున దబ్బకాయ రసం, జీలకర్ర, వాము కలిపి తీసుకుంటే కడుపులో నులిపురుగులు చచ్చిపోతాయి.

*దబ్బ ఆకులను ఎండాకాలం మజ్జిగలో వేసి పుచ్చుకుంటే పైత్యం, వడదెబ్బ నుంచే కాకుండా విరేచనాలు తగ్గుతాయి.

*ఈ రసాన్ని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు తగ్గుతాయి.

ABOUT THE AUTHOR

...view details