PRC Issue in AP: ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతన సవరణ అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తొలి తొమ్మిది నెలల పాటు ఇచ్చిన మధ్యంతర భృతి మొత్తాన్ని కూడా సర్దుబాటు చేస్తోంది. 2019 జులై నుంచి 2020 మార్చి వరకు ఐఆర్ రూపంలో ఇచ్చిన మొత్తం సుమారు రూ.5,375 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు లెక్కకట్టిన తర్వాత గతంలో ఇచ్చిన జీతాల సొమ్ముకు 9 నెలల ఐఆర్ మొత్తాన్ని కలిపి ఉద్యోగికి ఇంకా ఇవ్వాలా? ఉద్యోగి నుంచే వెనక్కి తీసుకోవాలా అన్నది తేలుస్తున్నారు. వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలు చేసేలోగా మధ్యంతర భృతి ఇవ్వడం అనాదిగా ఉన్నదే. ఐఆర్ రూపంలో కల్పించిన లబ్ధిని తిరిగి సర్దుబాటు చేయడం ఎప్పుడూ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 జులై నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 27శాతం ఐఆర్ అమలు చేస్తున్నారు.
తాజాగా దాన్ని తగ్గించి 23శాతం ఫిట్‌మెంట్‌తో కొత్త వేతన సవరణకు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు పొందిన ప్రయోజనాన్ని జీపీఎఫ్ ఖాతాలకు బదలాయిస్తారు. 2022 జనవరి నుంచి నగదు రూపంలో జీతంతో కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త వేతన సవరణను ఎలా అమలు చేయనుందో లెక్కలు కట్టి మరీ జీవోలు ఇచ్చింది. కొత్త పీఆర్సీ వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు ప్రయోజనం కలుగుతుందని సర్కారు చెబుతోంది.
ఇవీ విధివిధానాలు
- కొత్త పీఆర్సీ ప్రయోజనాలు 2020 ఏప్రిల్ నుంచి అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది. 2021 డిసెంబర్ వరకు పాత విధానంలోనే జీతాలు, ఐఆర్ చెల్లించింది. ఈ క్రమంలో ప్రభుత్వం పాత విధానంలో ఒక్కో ఉద్యోగికి 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు ఎంత ‘జీతం’ చెల్లించిందో ఆ మొత్తాన్ని లెక్కించింది. 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు ఇచ్చిన మొత్తం ‘మధ్యంతర భృతి’ని లెక్కించి దానికి కలిపింది.
- మరోవైపు 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలవుతుందని ప్రకటించినందున.. ఆ రోజు నాటికే కొత్త స్కేళ్ల లెక్క తేలుస్తుంది. ఆ ప్రకారం 2021 డిసెంబర్ వరకు నిజానికి కొత్త పీఆర్సీ ప్రకారం ఓ ఉద్యోగి ఎంత జీతం పొందాల్సి ఉందో లెక్కించింది. ఆ మొత్తానికి 9 నెలల డీఏ బకాయిలను కలిపారు. కొత్త పీఆర్సీ, పెండింగ్ డీఏల బకాయిలు కలిపితే కొత్త పీఆర్సీ ప్రకారం ఒక ఉద్యోగి ఎంత జీతం పొందాల్సి ఉందో లెక్క తేలుస్తున్నారు.
- ఇప్పుడు పాత, కొత్త వేతనాల మధ్య వ్యత్యాసాన్ని లెక్కిస్తారు. ఉద్యోగికి అదనంగా రావాల్సి ఉంటే ఆ మొత్తాన్ని వారి జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లే ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వాల్సి ఉంటే ఆ సొమ్మును భవిష్యత్తులో డీఏ, డీఆర్‌ల నుంచి మినహాయించుకుంటారు.
9 నెలల ఐఆర్ కోత
ఈ విధానం వల్ల 9 నెలల మధ్యంతర భృతిని మినహాయించుకున్నట్లైందని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా ఐఆర్ మినహాయించుకోలేదని చెబుతున్నారు. దీనివల్ల 27శాతం ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఎలా నెరవేర్చినట్లవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఇంత దారుణం ఎన్నడూ లేదు
''ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చిన మధ్యంతర భృతిని ఇలా సర్దుబాటు చేసిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ప్రస్తుతం పదకొండో పీఆర్సీ సిఫార్సుల నేపథ్యంలో కొత్త జీతాలు ఇస్తున్నారు. 2019 జులై నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్ పూర్తిగా ప్రభుత్వం మినహాయించుకున్నట్లవుతోంది. పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీనివల్ల ఎంతో నష్టపోతున్నారు.''