- సుహాస్ కొవిడ్ బారిన పడ్డాడు. ఇంట్లోవాళ్లే దగ్గరకి రాని పరిస్థితి. బతకనేమో అనే భయం పట్టుకుంది. ఫ్రెండ్ మణికి విషయం తెలిసింది. ‘అరే యార్.. నీకేం కాదు. ఇదీ జలుబు లాంటిదే. పదిరోజుల్లో కోలుకుంటావ్’ అని భరోసా ఇచ్చాడు. పల్స్ ఆక్సిమీటర్, ట్యాబ్లెట్ల దగ్గర నుంచి మంచి వంటకాల వరకూ తీసుకొచ్చి పెట్టాడు. రెండు వారాల్లో సుహాస్ మామూలయ్యాడు. ఆపై ఇద్దరూ బైక్‌పై లాంగ్‌టూర్‌కి వెళ్లిపోయారు.
- లావణ్య లవ్‌లో మోసపోయింది. చావే దిక్కనుకుంది. నిద్రమాత్రలు మింగితే హాస్టల్‌మేట్ హరిత వెంటనే స్పందించింది. రెండ్రోజులు అమ్మలా సపర్యలు చేసింది. ‘చావడం కాదు.. నిన్ను చీట్ చేసినోడి చెంప పగలగొట్టేలా ఎదిగి చూపించు’ అంది. లావణ్య పట్టుదలతో చదివింది ఏడాది తిరగకముందే బ్యాంక్ పీవోగా ఎంపికైంది.
- శ్రీధర్‌కి అప్పులు పెరిగాయి. ఉన్న ప్లాట్ అమ్మేయాలనుకున్నాడు. ‘అది మంచి ఏరియాలో ఉందిరా.. వద్దు’ అన్నాడు రమాకాంత్. అప్పులు తీర్చమని ఐదు లక్షలు స్నేహితుడి చేతిలో పెట్టాడు. తర్వాత శ్రీధర్ ప్లాట్‌కి దగ్గర్లో ఓ సెజ్ రావడంతో అతడి భూమి ధర అమాంతం పెరిగింది.
మణి, హరిత, రమాకాంత్.. ఈ స్నేహితులే లేకపోతే ఆ ముగ్గురి జీవితాలు తెల్లారిపోయేవే. కుటుంబీకులు, బంధువులు ఇవ్వలేని భరోసాను ఇచ్చి మిత్రుల జీవితాల్ని నిలబెట్టే ఇలాంటి దోస్త్‌లు ఎంతోమంది. ఎక్కువ స్నేహితులున్న వాడి జిందగీ పెట్రోమాస్ లైట్లా వెలిగిపోతూనే ఉంటుంది. ప్రతీదీ షేరింగ్ చేసుకునేవాళ్లుంటే బతుకంతా కేరింగ్‌గానే ఉంటుంది. క్లాస్రూమే కార్నివాల్ అవుతుంది. పిచ్చాపాటీ మాటలకు వేదికయ్యే క్యాంటీనే స్వర్గానికి అడ్డాగా మారుతుంది. దోస్త్‌లే ఆస్తులుగా ఉన్నవాడు కష్టాలనీ, కన్నీళ్లనీ తేలిగ్గా దాటేయగలడు. ఇన్ని చెప్పినా ‘అసలు ఫ్రెండ్ ఎందుకు ఉండాలి?’ అనే అనుమానం మీలో ఇంకా ఉందా? అయితే వినుకోండి.
స్నేహంతో ఆరోగ్యానికి మేలు
పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. కానీ స్నేహం చేయడం మనసుకి, తనువుకి, ఆరోగ్యకరం అంటున్నాయి చాలా అధ్యయనాలు. ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవాళ్లకి అనారోగ్య సమస్యలు తక్కువట. ముఖ్యంగా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ. స్నేహ బంధాలు ఉన్నవాళ్లకి కష్టాలు, కన్నీళ్లు, ఒత్తిళ్లు.. మనసులోనే పెట్టుకొని కుమిలిపోవాల్సిన పని లేదు. అన్నీ పంచుకున్నప్పుడు మెదడులో ఆక్సిటోసిన్ స్థాయిలు పెరిగి మనసు తేలిక పడుతుందట. 2010లో అమెరికాలో చేసిన అధ్యయనం ప్రకారం మిగతావారితో పోలిస్తే ఎక్కువ మిత్రులున్నవారు అకాల మరణం పొందడం తక్కువని తేల్చారు.
దోస్త్‌లే గురువులు
వ్యక్తి ఎదుగుతున్న దశలో మంచీచెడూ.. ఏదైనా నూటికి ఎనభైశాతం మంది స్నేహితుల్ని చూసే నేర్చుకుంటాడు. ఆటలు, చదువు, ఉద్యోగం, లక్ష్యాలు, షాపింగ్, అభిరుచులు, జీవిత నైపుణ్యాలు.. ప్రతీదీ ఫ్రెండ్స్ ద్వారానే అలవరచుకుంటాడు. ఒక్కొక్కరి నుంచి ఒక్కోటి నేర్చుకుంటారు. మనిషి చెడు దారి పట్టడంలో తొంభైశాతం స్నేహితులే కారణమట. ఒకరకంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒకరకమైన జీవనశైలి ఏర్పడటానికి వాళ్లే మార్గదర్శకులు. మంచి స్నేహితులుంటే ఆటోమేటిగ్గా సానుకూలమైన జీవితం గడుపుతామని చెప్పాల్సిన పనిలేదుగా!
మన బలమెంతో తెలుసు