సరదాగా మద్యం తాగుతూ ఒరేయ్ అని పిలిచినందుకు తన స్నేహితుడినే హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
మూసాపేట యాదవ బస్తీలో నివసించే తాడాల సుధీర్ సోమవారం రోజు రాత్రి తన స్నేహితులు నవీన్, కిరణ్, రాంబాబులతో కలిసి ఖైత్లాపూర్ మద్యం దుకాణం పక్కనే ఉన్న నిర్జన ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో మరో ముగ్గురు స్నేహితులు కిరణ్, సాబేర్, హర్షవర్దన్‌లు సుధీర్ దగ్గరకు వచ్చి అందరూ కలిసి మద్యం సేవించారు.
అదే సమయంలో, సుధీర్.. సాబేర్ని ఒరేయ్ అని పిలవడం వల్ల నన్ను ఒరేయ్ అని పిలుస్తావా అంటూ సాబేర్, సుధీర్‌తో గొడవ పడి, పక్కనే ఉన్న బీరు సీసాను పగులగొట్టి గొంతులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సుధీర్‌ని అతడి మిగితా స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.