హామీల అమలుపై కొత్త సర్కార్ ఫోకస్ - రేపటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం Free Transport for Women in RTC Buses from Tomorrow : కొత్తగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి రోజే ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించింది. ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మంత్రివర్గాన్ని రేవంత్ రెడ్డిసమావేశపర్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కేబినెట్ భేటీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా సమావేశంలో ప్రసంగించారు. అధికారులు బాగా పని చేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని, సమర్థంగా పని చేసి ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్‌రెడ్డి కోరారు. తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీలపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చించారు.
Congress Focused on Election Promises Implementation: గ్యారంటీల అమలుకు సంబంధించి సీఎం సహా మంత్రులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఆర్థిక వెసులుబాటును చూసుకోవాల్సి ఉంటుందని, ఇందుకోసం దశల వారీగా అమలు చేయాలని కొందరు మంత్రులు ప్రతిపాదించారు. గ్యారెంటీల అమలు, అవసరమయ్యే నిధులు, విధివిధానాలపై అధికారులు తమ అభిప్రాయాలు తెలిపారు.
కర్ణాటకలో గ్యారెంటీల అమలుకు సంబంధించిన విషయాలను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించినట్లు సమాచారం. గ్యారెంటీల అమలుపై మంత్రివర్గ ఉప సంఘం కర్ణాటక వెళ్లి అధ్యయనం చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రేపు సోనియా పుట్టినరోజు సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామన్న మంత్రులు, పూర్తి సమాచారం అందగానే అమలుపై దృష్టి సారిస్తామని చెప్పారు.
గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమావేశంలో చర్చ జరిగింది. 2014 నుంచి 2023 డిసెంబర్ 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఖర్చు, వాటి ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. విద్యుత్ అంశంపైనా మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలతో తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిందన్నారు. రూ.85 వేల కోట్ల అప్పులు చేశారని, పరిస్థితులను సంక్షోభంలోకి నెట్టి కాంగ్రెస్‌ను బద్నాం చేయాలనే కుట్రకు పాల్పడ్డారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వాస్తవ పరిస్థితిని ఎందుకు దాస్తున్నారంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, సమగ్రంగా సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
రూ.500లకు గ్యాస్ సిలిండర్ కావాలంటే తప్పనిసరి కేవైసీ అంటూ పుకార్లు - క్యూ కట్టిన వినియోగదారులు
ఈ క్రమంలోనే రాజీనామాలు ఆమోదిస్తే సీఎండీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా అని అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి, వారి రాజీనామాలు ఆమోదించవద్దని ఆదేశించారు. ఇవాళ జరిగే సమీక్షకు వారిని సైతం పిలవాలని చెప్పారు. కొత్త శాసనసభను రేపటి నుంచి సమావేశపరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. నూతన శాసనసభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఈ సమావేశాల్లో సభాపతి ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉండనుంది.
పలు ఇతర అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలపై చర్చించిన కేబినెట్, అధికారుల నుంచి పూర్తి వివరాలు అందాక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవలి తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను మంత్రులు, అధికారులు పరిశీలించి నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. పెట్టుబడి సాయం విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న మంత్రులు, ఆర్థిక శాఖ నుంచి అన్ని వివరాలు వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం వేళ ఎల్బీ స్టేడియానికి పోటెత్తిన జనం - డ్రోన్ విజువల్స్ చూశారా?
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు - సోషల్ మీడియాలో అసత్య ప్రచారం