తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతరించిపోతున్న హైదరాబాద్​ నక్కల చెరువు - SAGAR

ఇది మహానగర శివారులో అతిపెద్ద చెరువు... ఎప్పుడూ నిండుకుండలా నీటితో కళకళలాడుతూ ఉండేది. పక్కనే అటవీ ప్రాంతం... ఎన్నో రకాల పక్షులకు ఆవాసం. ఇంతటి సుందరమైన ప్రదేశం ప్రస్తుతం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లి కాలుష్యంలో మునిగిపోయింది. ఐదు వందల ఎకరాలున్న చెరువు 30 ఎకరాలు చేరిపోయింది.

నాడు విదేశీ పక్షులతో... నేడు చెత్త కుప్పలతో...

By

Published : Apr 16, 2019, 5:15 PM IST

Updated : Apr 16, 2019, 7:28 PM IST

ఫాక్స్ సాగర్... నక్కల చెరువు... ఏంటి ఈ పేర్లు మేమెప్పుడు వినలేదు అనుకుంటున్నారా..! ఇదో అందమైన చెరువు. చెరువు చుట్టుముట్టు పచ్చని చెట్లతో ప్రకృతి ప్రేమికులను మైమరిపించేది. 120 ఏళ్ల క్రితం ఆరో నిజాం కాలంలో ఈ చెరువును నిర్మించారు. హైదరాబాద్​లోని కుత్బుల్లాపూర్​లో ఉన్న ఈ చెరువును ఫాక్స్ అనే బ్రిటిష్ ఇంజినీర్ నిర్మించడం వల్ల ఫాక్స్ సాగర్ అని పేరొచ్చింది.

ఫాక్స్ సాగర్ అసలెలా ఏర్పడింది?

1897 సంవత్సరంలో 6వ నిజాం సూచన మేరకు బ్రిటీషు ప్రభుత్వం తమ సైనికుల స్థావరాలకు, నగర ప్రజలకు దగ్గరగా తాగునీరు, సాగునీరు అందించేందుకు ఈ చెరువును నిర్మించారు. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గ పరిధిలో ఉండే ఈ సాగర్ దాదాపు 5 వందల ఎకరాల్లో విస్తరించి ఉండి అనేక గ్రామాలకు జలప్రదాయనిగా ఉండేది. బోయి​న్​పల్లి ప్రాంతంలో ఉండే బ్రిటీష్ సైన్యానికి కూడా ఈ చెరువు నుంచే భూగర్భ పైప్​లైన్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. అప్పటి ఇంజినీర్ల ప్రతిభ పాటవాలకు నిదర్శనం చెరువుగట్టు వద్ద ఉండే పంప్ హౌస్. నూట ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సాగర్ కట్ట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. చెరువుకు లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు.

చెరువుగట్టు పక్కనే అడవి!

ఫాక్స్ సాగర్ పక్కనే దూలపల్లి అటవీ ప్రాంతం. ప్రతి ఏటా వర్షాకాలం, శీతాకాలంలో విదేశీ పక్షులు ఇక్కడకి వలస వచ్చేవి. ఆ సమయంలో పర్యాటకులు అధిక సంఖ్యలో ఈ చెరువును సందర్శించేవారు. ఎంతో ఘనకీర్తి ఉన్న ఈ చెరువు ప్రస్తుతం 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైపోయింది. పర్యాటకులను మైమరిపించిన ప్రాంతం కాలుష్యంతో నిండిపోయింది. సాగర్ పక్కనే విచ్చలవిడిగా భవనాలు, పరిశ్రమలు వెలిశాయి. వీటి ద్వారా వచ్చే జల కాలుష్యంతో విదేశీ పక్షులు వలస రావడం లేదు.

అధికారుల నిర్లక్ష్యంతోనే...!

అధికారుల నిర్లక్ష్యంతో... జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని విషతుల్యమైన కెమికల్ వ్యర్థాలను చెరువులో పడేస్తున్నారు. వాటి వల్ల స్థానిక ప్రజలకు దుర్గంధం, అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. అధికారులు స్పందించి కబ్జాదారుల నుంచి చెరువును రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి పూర్వ ​వైభవం తీసుకొచ్చి పర్యాటక ప్రాంతంగా మార్చాలని వేడుకుంటున్నారు.

మాటలకే పరిమితమైన హామీలు...

గతంలో ఫాక్స్​సాగర్​ను సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రాంతాన్ని మినీ ట్యాంకుబండ్​గా మార్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మాటిచ్చి ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికీ మోక్షం లభించలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాక్స్​సాగర్​ను అభివృద్ధి చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.

అంతరించిపోతున్న హైదరాబాద్​ నక్కల చెరువు

ఇవీ చదవండి: పదో తరగతి లెక్కల్లో తప్పులు... 6 మార్కులు ప్లస్

Last Updated : Apr 16, 2019, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details