Watchman Murder in Hyderabad: మద్యం మత్తు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ వైపు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోవైపు ఇంకొందరేమో తాగిన మైకంలో విచక్షణ కోల్పోతున్నారు. ఇందులో భాగంగానే సదరు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడానికి లేదా ప్రాణాలు తీయడానికీ వెనుకాడటం లేదు. ఫలితంగా తమతో పాటు ఇతరుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది.
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగి ఉన్మాదుల్లా ప్రవర్తించిన నలుగురు.. ఓ వాచ్‌మెన్‌ను హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నెల 20న చెన్నై నుంచి వచ్చిన నలుగురు డ్యాన్సర్లు.. హైదరాబాద్ స్పైసీ రెస్టారెంట్‌లో అద్దెకు దిగారు. పీకల్లోతు మద్యం సేవించి ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఇది గమనించిన రెస్టారెంట్ వాచ్‌మెన్ యాదగిరి వారిని మందలించాడు.
అక్కడికక్కడే మృతి చెందిన యాదగిరి: దీంతో ఆగ్రహానికి గురైన ఆ నలుగురు.. యాదగిరిని తీవ్రంగా గాయపరిచి మూడో అంతస్థు నుంచి కిందకు తోసేశారు. పై నుంచి కింద పడిపోయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు యాదగిరి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
"ఈ నెల 20న నలుగురు చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. వారు మద్యం సేవించి ఘర్షణకు దిగారు. ఇది గమనించిన రెస్టారెంట్ సిబ్బంది వాచ్‌మెన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న యాదగిరి గొడవ వద్దని వారించాడు. దీంతో వారు కోపంతో అతనిని కొట్టుకుంటూ పై నుంచి కిందకు తోసేశారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం."-పోలీసులు