Contract frauds in Hyderabad : మంత్రి వ్యక్తిగత సిబ్బందిమంటూ నమ్మించి సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఉత్పత్తుల కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్టారు. ఏకంగా రూ.17 లక్షల 65 వేలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సమగ్ర శిక్షా అభియాన్ పతకం కింద స్కూల్ షూస్ (బూట్లు), బ్యాగులు, సాక్సులు (మేజోళ్లు) విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. వీటిని సరఫరా చేసేందుకు హరియాణా రాష్ట్రం కర్నాల్‌లోని ఆల్ఫా ఇంటర్నేషనల్ సిటీకి చెందిన లిబర్టీ షూస్ సంస్థ ప్రతినిధులు విద్యాశాఖ మంత్రికి దరఖాస్తు చేసుకున్నారు.
మంత్రి సిబ్బందిమంటూ నమ్మించి :అనంతరం జీకే కుమార్, బెల్లి తేజ, ఆంజనేయులు, రమేష్‌రెడ్డి అనే వ్యక్తులు లిబర్టీ షూస్ కంపెనీ నిర్వాహకులను సంప్రదించారు. మంత్రి సబితాఇంద్రా రెడ్డికి వారు జీకే కుమార్ మంత్రి వ్యక్తిగత సహాయకుడిగా, తేజ రెండో వ్యక్తిగత సహాయకుడిగా, ఆంజనేయులు రాజకీయ కార్యదర్శిగా, రమేష్‌రెడ్డి పీఆర్‌వోగా పరిచయం చేసుకున్నారు. బూట్ల సరఫరా కాంట్రాక్టు తమకే ఇప్పిస్తామని నమ్మించారు. ఇందుకు రూ.17,65,000 అడ్మినిస్ట్రేటివ్, ఇతర ఛార్జీల నిమిత్తం చెల్లించాలని నమ్మించారు.