TSPSC Paper Leakage Case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజురోజుకూ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఈ కేసులో అరెస్టైన ఇద్దరు నిందితులు.. లీకైన ప్రశ్నపత్రాలతో తమ భార్యలను పరీక్ష రాయించినట్టు సిట్ అధికారుల విచారణలో బయటపడింది. పరీక్ష రాసిన ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరిని అధికారులు అరెస్టు చేశారు. కమిషన్ నెట్‌వర్క్ విభాగ ఇంఛార్జీగా పని చేసిన రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి.. డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష రాసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది.
నలుగురి అరెస్ట్ :మరోవైపు రేణుక రాఠోడ్‌కు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాహుల్‌కు పాత పరిచయం ఉంది. దీంతో అతడు ఆమె వద్ద నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం తీసుకుని పరీక్ష రాశాడు. నాగార్జున్‌సాగర్‌కు చెందిన రమావత్ దత్తు.. రేణుక భర్త ఢాక్యానాయక్ నుంచి ఏఈ ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. నిందితుల కాల్ డాటా ఆధారంగా.. ఏఈ, డీఏవో పరీక్షలు రాసిన అభ్యర్థులతో ఉన్న పరిచయాలపై లోతుగా పరిశీలించిన సమయంలో నలుగురి పేర్లూ వెలుగులోకి వచ్చాయి. దీంతో దత్తు, సుచరిత, రాహుల్, శాంతిలను అరెస్టు చేసిన సిట్ పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.
రాజశేఖర్ రెడ్డి బెయిల్ తిరస్కరణ..: ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి, ఏ-19, ఏ-20, ఏ-21గా ఉన్న మరో ముగ్గురు నిందితులు తమకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు నిందితుల పిటిషన్లను తిరస్కరించింది.
రెండు రోజుల క్రితమే ముగ్గురి అరెస్ట్..: ఈ కేసులో భాగంగా రెండు రోజుల క్రితమే సిట్ అధికారులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. క్రాంతి, రవితేజ, శశిధర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మురళీధర్ వద్ద క్రాంతి, శశిధర్ కొనుగోలు చేశారు. అలాగే డీఏవో ప్రశ్నపత్రాన్ని సాయిలౌకిక్ వద్ద రవితేజ కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తెేలింది.