కేంద్ర వ్యవసాయ బిల్లులను ఆమోదించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు, రైతుసంఘాలు ఆందోళనలకు దిగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కివ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వ్యవసాయ రంగం, రైతాంగ విశాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లులు రాజ్యసభలో అన్యాయంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆలిండియా సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు, రైతులు నిరసన చేపట్టారు. కార్పోరేట్, కాంట్రాక్టు వ్యవసాయంపై ఆర్డినెన్సులు, విద్యుత్ సంస్కరణల బిల్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పనకు చట్టం తీసుకు వచ్చి.. కార్పోరేట్ శక్తులను తరమికొట్టి.. రైతులను కాపాడాలని నినాదాలిస్తూ నిరసన చేపట్టారు. వ్యవసాయం రాష్ట్రాల జాబితాల్లో ఉన్నప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవేశపెట్టిన బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..
రైతులను కూలీలుగా మార్చే వ్యవసాయ బిల్లులు వ్యతిరేకించాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. దేశీయ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టవద్దని... లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తగిన సరైన సమయంలో మోదీ సర్కారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ, మార్కెట్ బిల్లులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. రైతు ఉత్పత్తుల వాణిజ్య - వర్తక (ప్రోత్సాహం - సౌలభ్యం) బిల్లు-2020”, “రైతుకు (సాధికారత - రక్షణ) ధరల భరోసా ఒప్పందం, వ్యవసాయ సేవల బిల్లు-2020” తమ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో రైతుసంఘాలు ఆందోళనబాట పట్టడంచూస్తే బిల్లుల పట్ల వ్యతిరేకత అద్దం పడుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతున్న వ్యవసాయ రంగంపై 18 కోట్ల మంది పైగా రైతు కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. బిల్లుల కారణంగా దేశవ్యాప్తంగా రైతులు కార్పోరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాయి.
మోదీ మాటలు అబద్ధం..
అమెరికాలో మాత్రమే సాధ్యమయ్యే కార్పోరేట్ సేద్యం భారత్‌లో యోగ్యమేనా అని రైతుసంఘాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. రైతుల సంకెళ్లు తీసేసే దిశగా చారిత్రాత్మక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేలా స్వేచ్ఛకావాలి. ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని ప్రధాని మోదీ చెబుతుండటం పచ్చి అబద్ధమని... రైతు రక్షణ ఫణంగాపెట్టి సేద్యం నుంచి రైతే.. వైదొలగేలా కార్పోరేట్ రంగానికి వ్యవసాయాన్ని అప్పగించే కుట్ర అని రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆక్షేపించారు.