National Civil Services Day Celebrations In Hyderabad: రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని.. చట్ట సభలు కాస్తా కొట్లాడుకునే సభలుగా మారుతున్నాయని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత సివిల్ సర్వీసెస్ దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, సివిల్ సర్వీసెస్, న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, మీడియాలో ఉన్నవారు నిష్పాక్షికంగా తమ బాధ్యతలను నిర్వహించాలని సూచించారు. ఆయా రంగాల్లో వారు సమర్థవంతంగా సేవలు అందిస్తే.. దేశం వృద్ధి సాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అధికారులు అభివృద్ధికి సారథులు.. భవిష్యత్తు వారథులు: బ్రిటీష్ వారు దేశాన్ని, ప్రజల ఆలోచనలను కూడా దోచుకున్నారని వెంకయ్య విమర్శించారు. దేశ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు. సివిల్ సర్వీసెస్‌లో ఉన్నవారు నీతి, నిజాయతీతో వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు నేరుగా లబ్ధి కలగజేయడంలో సివిల్ సర్వీసెస్ అధికారులదే కీలకపాత్ర అని గుర్తు చేశారు. అధికారులు అంటే.. అభివృద్ధికి సారథులు, భవిష్యత్‌కు వారథులు అని కితాబిచ్చారు. కాలానుగుణంగా.. భవిష్యత్ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. అధికారులు.. ప్రజల బాధలను సావధానంగా, ఓర్పుగా వినాలని సూచించారు.