Former RBI Governor Meets CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే ఓ వైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. వీటన్నింటినీ చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, సహచర మంత్రులతో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు.
శాఖల వారీగా వివిధ అంశాలపై రేవంత్‌రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు. వివరాలు అడుగుతూ నివేదికలు ఇవ్వాలని ఆదేశిస్తూ అవసరమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రాష్ట్ర అభివృద్ధిపై కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టారు.
రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ : ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఇరువురు సమావేశమై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు మెరుగు పరుచుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం - ఎన్నికలకు ముందు మంజూరై ఉన్న, ప్రారంభం కానీ పనుల నిలివేత
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ (Former RBI Governor Raghuram Rajan), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేశారు. కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు, అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు.