Former MP Rapolu Ananda Bhaskar Joining Trs: భాజపా నేత, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన తెరాసలో చేరారు. అంతకు ముందు భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ప్రకటించారు. అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్ నాలుగున భాజపాలో చేరానని.. ఇంతకాలం పార్టీలో కలిసి ఉండే అవకాశం కల్పించినందుకు ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.
భాజపా వసుదైన కుటుంబ భావనకు పెద్ద పీట వేస్తుందనుకొన్నానని.. ఈ సూత్రానికి పార్టీ నిజంగా కట్టుబడి ఉందా అనే అనుమానాన్ని రాపోలు వ్యక్తం చేశారు. దేశంలో ఇబ్బందికరమైన విచ్ఛిన్నకరమైన రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయని రాపోలు ఆరోపించారు. పార్టీని వీడే సమయంలో తప్పులు ఎత్తి చూపడం తన లక్షణం కాదని ఆయన పేర్కొన్నారు.. నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటారనే భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రాంతీయత, భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూడడం పార్టీకి అలవాటుగా మారిందని రాపోలు ఆనంద భాస్కర్ ఆక్షేపించారు. ఏకభాషా పెత్తనాన్ని ప్రోత్సహించడం కూడా ఎక్కువైందని అభిప్రాయపడ్డారు. చేనేతపై జీఎస్టీని విధించి ఆ రంగాన్ని భూస్థాపితం చేద్దామని భాజపా చూస్తోందని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఉచితాల కింద లెక్కగట్టడం తన మనసు లోతులను గాయపర్చిందని తెలిపారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో తనను విస్మరించారని రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.