తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌లో పది లక్షల మంది ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది మహిళా నేతగా, ప్రాంతీయ పార్టీ నాయకురాలిగా నిలిచారు. ట్విటర్‌లో కవితను అనుసరిస్తున్న వారిలో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, సుప్రియా సూలె, ప్రభు చావ్లా, శేఖర్‌గుప్తా, బర్ఖా దత్, నవీన్ జిందాల్, గౌరవ్ గగోయ్, దేవేందర్ హుడా తదితరులున్నారు.
దశాబ్దం నుంచి..
- 2010 ఆగస్టులో కవిత ట్విటర్ ఖాతా ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఆమె తెలంగాణ డిమాండ్‌ను బలంగా వినిపించారు.
- ట్విటర్‌ను వేదికగా చేసుకొని జాగృతి ద్వారా బతుకమ్మ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటారు.
- నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పసుపు బోర్డుతో సహా ముఖ్య సమస్యల్ని చట్టసభలతోపాటు ట్విటర్‌లోనూ ప్రస్తావించి పరిష్కారానికి కృషిచేశారు.
- కష్టాల్లో ఉన్నవారు ట్విటర్ ద్వారా సాయం కోరితే వెంటనే కవిత స్పందించి చేయూతనిస్తున్నారు.
శిరస్త్రాణం బహుమతి
2017లో రాఖీ పండగ సందర్భంగా ప్రతి మహిళా తమ సోదరులకు రాఖీ కట్టడంతోపాటు శిరస్త్రాణం (హెల్మెట్) బహూకరించాలని 'సోదరీమణుల చొరవ - హెల్మెట్ బహుమతి' పేరిట కవిత చేపట్టిన కార్యక్రమం ట్విటర్ వేదికగా దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్వయంగా అభినందించారు. ప్రముఖ నటులు మహేశ్‌బాబు, నాని, క్రీడాకారులు గంభీర్, సెహ్వాగ్, పీవీ సింధు, సైనా, గగన్ నారంగ్ తదితరులు ప్రశంసించారు.