యావత్ తెలంగాణ అసహ్యించుకునేలా తనపై దుష్ప్రచారం జరిగిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల భూములు ఆక్రమించానని, కుంభకోణాలు చేసినట్లు దుష్ప్రచారం చేశారన్నారు. 19 ఏళ్లపాటు కేసీఆర్‌తో కలిసి పనిచేశానని... తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో పోరాడే అవకాశం తనకు కల్పించారన్నారు. పార్టీకి మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు.
'ఫ్లోర్ లీడర్‌గా, మంత్రిగా కూడా కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మచ్చతెచ్చే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఏనాడూ అధర్మం వైపు వెళ్లలేదు. ఏనాడూ అణచివేతకు భయపడలేదు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు. డబ్బులను నమ్ముకోలేదు. అలాంటి కేసీఆర్ నాలాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకుని చర్చోపచర్చలు జరిపారు. అనంతరం అసత్య ప్రచారానికి ఒడిగట్టడం కేసీఆర్ స్థాయికి తగదు. అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఉంటే నేను శిక్షకు అర్హుడిని. ఏవో భూములు మీరే చూపించి మావే అని చెబుతున్నారు. రాజ్యం మీ చేతిలో ఉండవచ్చు, అధికారులు మీరు చెప్పింది చేయొచ్చు. భూములు కొలుస్తామని ఒక్క నోటీసు అయినా ఇచ్చారా? మేము లేకుండా వందల మంది పోలీసులను పెట్టి సర్వే చేయడం మీకు న్యాయసమ్మతమేనా?'