తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్యకర్త ఇంటి కూల్చివేతను అడ్డుకున్న భూమా అఖిలప్రియ - Tension in Allagadda

ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో టీడీపీ కార్యకర్త ఇల్లు కూల్చివేత ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. తన పట్టా స్థలంలో కాలువ నిర్మించడమే కాకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ నాగరాజు వారిని అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఘటనా స్థలానికి చేరుకుని.. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

Tension in Allagadda
Tension in Allagadda

By

Published : Dec 8, 2022, 1:31 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జి జమ్ములదిన్నె గ్రామంలో టీడీపీ కార్యకర్త బోయ నాగరాజు ఇంటిని అధికారులు కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామంలో అతను ఉన్న ఇంటిని కాలువ నిర్మాణం కోసం తొలగించాలని.. బుధవారం అధికారులు జేసీబీతో గ్రామానికి చేరుకున్నారు. తన పట్టా స్థలంలో కాలువ నిర్మించడమే కాకుండా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూలుస్తున్నారంటూ బోయ నాగరాజు అధికారులను అడ్డుకున్నాడు.

కూల్చివేతపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తన అనుచరులతో గ్రామానికి చేరుకొని కూల్చివేతను అడ్డుకున్నారు. అధికారులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇంటిని అక్రమంగా కూల్చి వేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ సీఐ రాజశేఖర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ.. కూల్చివేతకు పట్టు పడుతున్నారని ఆరోపించారు. భూమా అఖిలప్రియ చేస్తున్న నిరసనకు తలొగ్గిన అధికారులు కూల్చివేతను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

అన్ని పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్తామని అధికారులు హామీ పత్రం రాసి భూమా అఖిలప్రియ చేతికి ఇచ్చారు. అధికారులు వెనక్కి తగ్గినా, భూమా అఖిలప్రియ మాత్రం తన నిరసనను కొనసాగించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి పూర్తిగా అక్రమంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన గ్రామాన్ని వీడే వరకు తాను నిరసనను కొనసాగిస్తూనే ఉంటానని పట్టు పట్టారు. ఓవైపు పోలీసులు.. మరోవైపు భూమా అఖిలప్రియ గ్రామంలోనే ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details