తెలంగాణలో బహుజన స్థాపన వస్తే ఎవరూ ఆపలేరని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(RS PRAVEEN KUMAR) అన్నారు. తనను కలిసిన బహుజన చిరుద్యోగులను సస్పెండ్ చేశారని.. మరి తనను గుండెల్లో పెట్టుకున్న లక్షలమందిని ఏం చేస్తారని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండాలనేదే పాలకుల ఆలోచన అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలోని మెక్ స్టార్ ఆడిటోరియంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆకునూరి మురళి పాల్గొన్నారు.
హుజూరాబాద్ కోసమే దళిత బంధు
తెలంగాణలో బహుజన ఆవిర్భావం అనే సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ప్రగతిభవన్‌తో సహా ఏ శక్తి ఆపలేదని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎప్పుడైతే ఒక భావన... ఆలోచనకు సమయం ఆసన్నమవుతుందో... దాన్ని ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదని ఫ్రెంచ్ మేధావి విక్టర్ యూగో అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని పేర్కొన్నారు. దళితబంధు పథకం కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే తీసుకొచ్చారని ఆరోపించారు.
పాలకులే కారణం
పశ్చిమ యూరప్‌లో ప్రింటింగ్ ప్రెస్ గొప్ప విప్లవం తీసుకొచ్చిందని అన్నారు. ఒట్టోమన్ సామ్రాజ్యంలో ప్రింటింగ్ ప్రెస్ వస్తే... ప్రజలు అన్ని విషయాలు తెలుసుకుంటారు... తిరుగుబాటు చేస్తారని అప్పుడు మనం ఎట్లా పాలకులం అవుతామని భావించి ప్రింటింగ్ ప్రెస్‌నే నిషేధించారని వివరించారు. విశ్వవిద్యాలయాలు, పాఠశాలల వ్యవస్థ నిర్వీర్యం అయ్యేందుకు కారణం పాలకులేనని స్పష్టం చేశారు. అప్పటకీ, ఇప్పటి తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదన్నారు. అందుకే బహుజన రాజ్యం రావాలన్నారు.
ఎవరికో గుణపాఠం చెప్పాలని వెయ్యి కోట్లు ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. ఈ వెయ్యి కోట్లతో రెండు లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వొచ్చు. పది లక్షల ట్యాబ్‌లు ఇవ్వొచ్చు. వెయ్యి ఆన్‌లైన్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయవచ్చు. అద్భుతమైన హాస్టళ్లు నిర్మించవచ్చు. 20 మహిళా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు. 50 గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించవచ్చు. 50వేల కమ్యూనిటీ లైబ్రరీలు ఏర్పాటు చేయవచ్చు. సచివాలయం కూలగొట్టి... రూ.500కోట్లతో నూతనంగా కట్టిస్తున్నారు. పేదలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు చులకనభావం.