తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి విషమం - naini narsimha reddy health in critical

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28న కరోనా బారినపడ్డ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు.

Former Home Minister Naini Narasimhareddy's health is critical
మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి విషమం

By

Published : Oct 16, 2020, 1:06 PM IST

రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ కూడా వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకుని ఇంటికి వస్తారని అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారింది. దీంతో పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ అయి న్యుమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారు. దీంతో నాయిని ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయాయి. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఆయన్ను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పల్మనాలజీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్‌ రవి ఆండ్రూస్, మరో డాక్టర్‌ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

భార్య, అల్లుడు, మనుమడికి కరోనా

ఇదిలా ఉండగా నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు పరీక్షలో నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆసుపత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఎలా సోకింది..?

లాక్‌డౌన్‌తోపాటు కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి ఇటీవల ముషీరాబాద్‌లో జరిగిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొని అభిమానులు అందించిన కేక్‌ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: మూడోరోజు కేటీఆర్ పర్యటన.. జీహెచ్​ఎంసీ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా

ABOUT THE AUTHOR

...view details