బెజవాడ దుర్గగుడి వెండి రథం మూడు సింహాల ప్రతిమల అదృశ్యం కేసులో ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక కీలకం కానుంది. ఫోరెన్సిక్ లేబరేటరీస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె.శరీన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రథం వద్ద సేకరించిన ఆధారాలు సమగ్రంగా పరిశీలించి ఇచ్చే నివేదిక.. చోరీ ఎప్పుడు జరిగిందన్న విషయంపై నిర్ధరణకు రావడానికి దోహదపడతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
గత నెల 14న దేవస్థానం అధికారులు రథానికి ఉన్న వెండి సింహం ప్రతిమలు చోరీకి గురైన విషయాన్ని గుర్తించారు. ఘటనా స్థలంలో లభ్యమైన వెండి సింహాల రేకులపైన పేరుకుపోయిన రజను, ఇతర ఆధారాల ద్వారా ఎన్ని రోజుల క్రితం వాటిని పెకిలించారన్న విషయాన్ని నిర్ధరిస్తారని అధికారులు చెబుతున్నారు. వీటిని లాక్డౌన్ సమయంలోనే పెకిలించారా లేక దేవాలయం తెరిచిన తర్వాత అనే విషయంపై అధికారులు నిర్ధరణకు వచ్చే అవకాశం ఉంది.