Food Processing Industries in Telangana : తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. అందుకు తగిన విధంగా ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు అందజేస్తుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలను ప్రోత్సహిస్తూ.. వారు స్వయం ఉపాధి పొందాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందిస్తోంది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా సూక్ష్మ, చిన్న తరహా ఆహారశుద్ధి పరిశ్రమలు స్థాపించాలని నిర్ణయించింది. వీటిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ద్వారా నెలకొల్పి.. డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని భావిస్తోంది.
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రతిపాదనలో ప్రభుత్వం జిల్లాకో ఆహారశుద్ధి ప్రత్యేక మండలిని ఏర్పాటు చేయనుంది. పారిశ్రామిక సంస్థల ద్వారా జిల్లాల్లోని గ్రామాల్లో పంటలు, కూరగాయలు, పండ్ల తోటల ఉత్పత్తుల ఆధారంగా ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,35,364 మహిళా సంఘాల్లో 45,60,518 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల్లో గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలు స్థాపించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌తో సెర్ప్ ఒప్పందం.. ఇకపై ఆన్లైన్లో ఆ వస్తువులు
Rural Poverty Alleviation Organization : అందుకు వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల శాఖలను సమన్వయం చేసుకుని.. తగిన నివేదికను రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయానికి సంబంధించిన సమగ్ర నివేదిక రూపొందించి ఇవ్వాలని.. ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు పంపింది. అయితే ఇప్పటికే దాదాపు 500కు పైగా మహిళా సంఘాలు ఆహారశుద్ధి కుటీర పరిశ్రమలను నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. తాజాగా ఇప్పుడు తీసుకువస్తున్న పరిశ్రమల ఆలోచనతో.. గ్రామాల్లో మరింత మందికి మహిళలకు ఉపాధి మెరుగవుతుందని ప్రభుత్వం అంచనా.