హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌లో తినుబండారాల స్టాల్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. స్టాళ్లలో విక్రయించే ఆహార పదార్థాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బాగోతం బట్టబయలైంది. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ధరకంటే అధిక రేటుకు విక్రయించే స్టాళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంజీబీఎస్‌లోని ఓ స్టాల్లో రూ.30 ఉన్న ఒక బిస్కెట్ ప్యాకెట్‌ను రూ.35 కు విక్రయిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు రావడంతో వెంటనే స్పందించిన అధికారులు నిర్వాహకుడికి రూ.1000 జరిమానా విధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 364 బస్టాండ్లు ఉన్నాయి. వీటిలో సుమారు వంద బస్టాండ్లలో స్టాళ్లు ఏర్పాటు చేయలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మిగిలిన సుమారు 264 బస్టాండ్లలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి పెద్ద బస్టాండ్లలో ఎక్కువగా స్టాళ్లు ఉంటాయి. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రయాణ ప్రాంగణాల్లో కూడా స్టాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఏర్పాటు చేశారు. వీటిల్లో చాలా చోట్ల ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదు రావడంతో తనిఖీలు
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఆర్టీసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగరంలోని ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్‌లో ఉన్న స్టాళ్లను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారికి జరిమానాలు విధించారు.