అంతరించిపోతున్న ఆదివాసీ తెగల ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అదనపు పోషకాహారాన్ని అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
ఆదివాసీ తెగల ఆరోగ్యంపై దృష్టి సారించండి: సత్యవతి రాఠోడ్ - Minister satyavathi review on tribals
గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల అధికారులతో ఆ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. అంతరించిపోతున్న ఆదివాసీ తెగల ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.
గతేడాది కంటే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించిన నేపథ్యంలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సద్వినియోగం చేయాలని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక ఆరోగ్యలక్ష్మి పథకానికి బడ్జెట్లో ఏకంగా వందశాతం నిధులు పెంచినట్లు పేర్కొన్నారు. అంతరించిపోతున్న ఆదివాసీ తెగల్లో పోషకాహార లోపంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్న మంత్రి... ఇందుకోసం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటింటికి రేషన్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని సత్యవతి రాఠోడ్ వెల్లడించారు. గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేలా ఒకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టాలని తెలిపారు. రహదారి వసతులు లేని ఏవైనా గిరిజన ఆవాసాలు ఉంటే వెంటనే వాటికి రోడ్లు వేసేలా ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు.