హైదరాబాద్ నగరంలో ఎన్నికలకు ముందు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వరద ప్రభావిత డివిజన్లలో తెరాస పైచేయి సాధించలేకపోగా ఆ ప్రాంతాల్లో భాజపా సత్తా చాటింది. భాజపా గెలిచిన పలుచోట్ల తెరాస సిట్టింగ్ కార్పొరేటర్లు ఓటమి చవిచూశారు. ప్రధానంగా 24 డివిజన్లపై వరద ప్రభావం అధికంగా కనిపించింది. 17 చోట్ల తెరాస సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.
గత అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు హబ్సిగూడ, రామంతాపూర్, సుభాష్‌నగర్, మల్లాపూర్, ఏఎస్‌రావునగర్, జీడిమెట్ల, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, చైతన్యపురి, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, టోలిచౌక్, చాంద్రాయణగుట్ట, చిలుకానగర్, ఉప్పల్, నాచారం డివిజన్లలో వరద తాకిడికి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఈ ప్రాంతాల్లోని 15 డివిజన్లలో కమలం వికసించింది. కేవలం 4 స్థానాల్లోనే తెరాస విజయాన్ని దక్కించుకుంది. 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 3 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది.