Floods effect in hyderabad: ప్రణాళిక లేని పట్టణీకరణ.. ఆక్రమణలతో వరద గండం.!
చిన్నపాటి చినుకు కురిస్తేనే చాలు భాగ్యనగరం అతలాకుతలం అయిపోతుంది. ఇక భారీ వర్షాలు వస్తే.. ఏది చెరువో ఏది రోడ్డో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. దీనికంతటి ప్రధాన కారణం పట్టణీకరణ పేరుతో ప్రణాళిక లేకుండా కట్టడాలు, కబ్జాలు చేయడమే అంటున్నారు ఐఐఆర్‌ఎస్ పరిశోధకులు. మరి నగరంలో వరదలపై వారి విశ్లేషణ ఏంటో చూద్దాం.
హైదరాబాద్ వరదలు
By
Published : Jul 22, 2021, 8:51 AM IST
* 24 ఆగస్టు 2000 హైదరాబాద్ నగరంలో భారీ వర్షం.. సుమారు 241 మి.మీల వర్షపాతం. భారీ వరదల కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు సుమారు రూ.135 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.
* 13 అక్టోబరు 2020 నగరంలో 192 మి.మీల వర్షపాతం.. ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా 81 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.5 వేల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది.
భాగ్యనగరం..వర్షం పడితే బాధల నగరమే. చిన్నపాటి వర్షం పడినా లోతట్టు ప్రాంతాల ప్రజల్లో వణుకు మొదలవుతోంది. మున్ముందు ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పట్టణీకరణ పేరుతో చేపట్టిన అశాస్త్రీయ నిర్మాణాలే వరద ముంపునకు కారణమవుతున్నాయి. ఇప్పుడే మేల్కొని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాలని సూచిస్తున్నారు. 2000-2020 వరకు నగరంలోని వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, వరద ముంపునకు కారణాలు, ఆస్తి, ప్రాణనష్టం తదితర అంశాలపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) డెహ్రాడున్‌కు చెందిన పరిశోధకులు సి.ఎం.భట్, ఎన్‌ఐటీ వరంగల్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు ఎన్.వి.ఉమామహేశ్, తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు వినయ్ అశోక్ రంగారీ అధ్యయనం చేశారు. ఐదేళ్ల పరిశోధన అనంతరం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
20 ఏళ్లలో 16.5 శాతం పట్టణీకరణ
రెండు దశాబ్దాల్లో పట్టణీకరణ 16.5 శాతం పెరిగింది. జలాశయాల ఆక్రమణలు, ఖాళీ ప్రదేశాలు కానరాకుండా కాంక్రీట్ జంగల్‌లా మార్చడం, డ్రైనేజీలోనే వరద నీటిని కలిపేయడం, ఇంకుడు గుంతలపై దృష్టి సారించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. వరద ప్రభావిత ప్రాంతాలైన బేగంపేట, అమీర్‌పేట, మాదాపూర్, కూకట్‌పల్లి, రాజీవ్ గాంధీనగర్, ఆదర్శ నగర్, ప్రగతి నగర్, లక్ష్మీనగర్, చంద్రానగర్, తులసీనగర్ తదితర ప్రాంతాల్లో అధ్యయనం చేయగా వరదనీరు ఇంకే దారే లేదని పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.
హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్లే భారీ వర్షాలు
1990 నుంచి హైదరాబాద్ పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. నగరం కాంక్రీట్ మయం అవుతుండటం, పచ్చదనం తగ్గిపోవడంతో ‘హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ ఏర్పడి నగరంలో తక్కువ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వరదలు ముంచుకొచ్చి ఎక్కువ స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. 1992 నుంచి 2013 వరకు నగరంలో వర్షపాతంపై అధ్యయనం చేసి గతంలో పలు పరిశోధన పత్రాల్లో ఈ విషయాలను వెల్లడించాను. మున్ముందు రోజుల్లోనూ పట్టణీకరణ పెరిగి ఐదారు గంటల్లోనే భారీ వర్షపాతం నమోదై వీధులు మునిగే సందర్భాలను చూడబోతున్నాం. దీనికి అందరూ సంసిద్ధంగా ఉండాలి. జలాశయాల ఆక్రమణలే నగరానికి శాపంగా పరిణమించాయి. - ప్రొ.ఉమామహేశ్, ఎన్‌ఐటీ వరంగల్
నగరంలోని వరద ప్రభావిత ప్రాంతంలో 2000 సంవత్సరంలో 65 శాతం ఉపరితలం కాంక్రీట్ మయం కాగా 2020లో అది 89 శాతానికి చేరింది.