Annamayya Reservoir Disaster: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం మట్టికట్ట (ఎర్త్‌బండ్) వరద ఉద్ధృతికి తెగిపోవటంతో.. చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఒడ్డునున్న పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాలను వరద (Floods in AP) ముంచెత్తింది. ఇళ్లన్నింటినీ కూలదోసుకుంటూ.. ఉవ్వెత్తున ప్రవహించిన జలరాశి ఆ రెండూళ్లను శిథిలాల దిబ్బగా మార్చేసింది. ఇప్పుడు అక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి కథలే. పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇళ్లు క్షణాల్లో నేలమట్టమై నిలువనీడ కరవైన అభాగ్యుల గాథలే.
నిలువనీడా కరవైంది
ఈ రెండు గ్రామాల్లో 80 శాతం మందికి ఇప్పుడు నిలువనీడైనా లేకుండా పోయింది. ఇంట్లోని సామగ్రి, బంగారం, డబ్బులు, దుస్తులు అన్నీ కొట్టుకుపోయి, బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వరద రాకముందు వారి ఇళ్లున్న స్థలాల్ని చూసుకుంటూ పగలూరాత్రీ అక్కడే నడిరోడ్డుపైనే ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద పెట్టే, దాతలు అందించే ఆహారంతో కాలం నెట్టుకొస్తున్నారు. కొందరు చిన్న చిన్న టార్పాలిన్లు వేసుకుని వాటి కింద తలదాచుకుంటున్నారు. వరద ముంచెత్తి బుధవారం నాటికి అయిదు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ఈ గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. చీకట్లోనే మగ్గిపోతున్నామని పులపుత్తూరుకు చెందిన ఉమామహేశ్వరరాజు ఆవేదనగా చెప్పారు.
తర్వాత ఎక్కడుండాలి?
పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాల్లో అనేక మంది అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. అవి తీరకముందే కట్టుకున్న ఇళ్లు వరద ధాటికి కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలామని కన్నీటిపర్యంతమవుతున్నారు. కొందరికైతే వారి బంధువులు, స్నేహితులు దుస్తులు తెచ్చిచ్చేవరకూ మార్చుకోవడానికి మారుబట్టలు కూడా లేవు.
పిల్లలు తాగేందుకైనా పాలు లేవు
పులపుత్తూరు ఎస్సీ కాలనీలో చిన్నారులకు అయిదు రోజులుగా పాలు లేవు. పాలు అని అడిగినప్పుడు తినటానికి ఏదైనా ఇచ్చి బాబును బుజ్జగిస్తున్నామని పులపుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన ఒంటిమిట్ట భారతి వాపోయారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఇలాంటి పిల్లలు అనేక మంది ఉన్నారు.
సగం ఊరు సమాధి
అంతెత్తున పోగుపడిన ఇసుక మేటలపై నిల్చున్న ఈయన పేరు వెంకటశివయ్య. ఆయన చుట్టూ కనిపిస్తున్న ఇసుక దిబ్బల కింద నిన్నమొన్నటి వరకూ ఊరుండేది. చిత్రంలో కనిపిస్తున్న ఇంటిని ఆనుకుని పదుల ఇళ్లు ఉండేవి. ఈ నెల 19 వేకువజామున నిమిషాల వ్యవధిలో గ్రామాన్ని వరద ముంచెత్తటంతో అక్కడున్న ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. వరద తగ్గాక ఇళ్ల స్థానంలో ఇలా ఇసుక మేటలు కనిపించాయి. రాజంపేట మండలం తోగూరుపేట గ్రామంలో పరిస్థితి ఇది. ఈ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉండగా వాటిలో అక్కడక్కడ కొన్ని మాత్రమే మిగిలాయి.