ఇటీవల భారీ వర్షాలు, వరదలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోని సామగ్రి మొత్తం పాడైపోయింది. కొన్నిచోట్ల వారాల పాటు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే గడిపారు. అనేక మంది ఇళ్లు వదిలేసి వెళ్లారు. 100 ఏళ్లలో కనివినీ ఎరుగని రీతిలో కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. దాదాపు రూ.500 కోట్ల వరకు అందించారు. సాయం అందని బాధితులు అనేక మంది ధర్నాలు, ఆందోళనలకు దిగారు. స్పందించిన ప్రభుత్వం అర్హులందరికీ సాయం చేస్తామని భరోసా ఇచ్చింది. మీ-సేవా కేంద్రాల్లో ధరఖాస్తు చేసుకుంటే నగదును నేరుగా ఖాతాల్లోనే వేస్తామని చెప్పింది. ఈ ప్రకటనతో గ్రేటర్ పరిధిలో వరద బాధితులు మీ-సేవా కేంద్రాల వద్ద బారులు తీరారు.
నమోదు చేసుకున్న మరుసటిరోజే
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే వరద ముంపు ఆర్థిక సాయం తక్షణమే అందుతుండగా బాధితులు పేర్ల నమోదుకు క్యూ కడుతున్నారు. మీ-సేవలో పేర్లు నమోదు చేసుకున్న మరుసటి రోజునే నగదు ఖాతాల్లో జమ అవుతోందని బాధితులు చెబుతున్నారు. చందానగర్‌లోని మీ-సేవా కేంద్రం వద్దకు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శేరిలింగంపల్లి పరిధిలో ఉన్న మీ-సేవా కేంద్రం వరద బాధితులతో కిటకిటలాడింది. అంబర్‌పేట్ పోలీస్ లైన్‌లోని మీ-సేవా కేంద్రాల వద్ద పెద్దసంఖ్యలో బాధితులు బారులు తీరారు. బాధితులు భౌతిక దూరం పాటించకపోవడంతో పాటు గందరగోళం తలెత్తగా మీ-సేవా కేంద్రాన్ని పోలీసులు మూసివేయించారు.