ఆర్థిక సాయం అందట్లేదని వరద బాధితుల ఆందోళనలు ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే పూర్తిస్థాయిలో సాయం అందడం లేదని బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. వరద సాయం అందించాలని పటాన్చెరు గ్రేటర్ సర్కిల్ కార్యాలయం ముందు స్థానికులు నిరసనకు దిగారు.
ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదని లంగర్‌హౌస్ పరిధిలోని ప్రశాంత్ నగర్ ఫేజ్- 2 వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వరదల్లో నిత్యావసర సరకులు, వస్తువులు కొట్టుకుపోయి భారీ నష్టం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఎస్ మక్తా, సుభానీ మసీద్, హరిగేట్ ప్రాంత ప్రజలు వాపోయారు.
సాయం అందడంలేదంటూ... చంపాపేట్‌లో ముంపు ప్రాంతాల బాధితులు ధర్నా చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా ఉన్న కుటుంబాలకే ఆర్థిక సాయం అందిస్తున్నారని వాపోయారు. చంపాపేట్ పరిధిలోని రెడ్డికాలనీ, రాజిరెడ్డి నగర్, పద్మానగర్‌తోపాటు పలు కాలనీలకు చెందిన బాధితులు... కార్పొరేటర్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
అబిడ్స్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలోనూ వరద బాధితులు ఆందోళన చేశారు. గన్‌ఫౌండ్రి డివిజన్, అబిడ్స్, నేతాజీ నగర్ వాసులు కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్‌పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీలో బాధితులకు డబ్బుల పంపిణీ గందరగోళంగా మారింది. అర్హులకు కాకుండా... అనర్హులకు ఇస్తున్నారని ఆందోళన చేశారు.
హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ వివేకానందనగర్‌లోని వార్డు కార్యాలయం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. వరద సహాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 వేల ఆర్థిక సహాయం బాధితులకు అందడం లేదంటూ ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అర్హులందరికి రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలని మహిళలు డిమాండ్ చేశారు.
వరద బాధితులకు ఇచ్చే పదివేల రూపాయలులో దళారులు చేతివాటం చూపిస్తున్నారని జియాగూడలో బాధితులు ఆరోపించారు. జియాగూడలోని తెరాస కార్పొరేటర్ మిత్ర కృష్ణ అనుచరుడు కేశవ్ వరద బాధితులకు రూ. 10 వేలు ఇప్పించి... వారినుంచి రూ. 5 వేలు తిరిగి తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఈ దృశ్యాలను ఓ వరద బాధితుడు తన చరవాణిలో బంధించాడు. వరద బాధితుడు ఒక రెండు వేలు తీసుకోమ్మని మొరపెట్టుకున్నా తన ఒక్కడికే కాదని బుకాయించాడు.
ఇదీ చదవండి:సాయం కోసం ముంపు ప్రాంత బాధితుల ఆందోళన