వరద పరిస్థితులను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌ను వినియోగించి అంచనా వేసే పద్ధతిని బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్ పరిశోధకులు (BITS-Pilani Hyderabad Campus Researchers) ప్రయోగించి విజయం సాధించారు. సివిల్ ఇంజినీరింగ్ ఆచార్యుడు కె.శ్రీనివాసరాజు నేతృత్వంలోని పరిశోధక విద్యార్థిని రాంపల్లి మాధురి పరిశోధన చేపట్టి విజయవంతంగా ప్రయోగించారు. కెమికల్ ఇంజినీరింగ్‌కు చెందిన శశాంక్ సహకరించారు. ఈ పద్ధతితో మానవ ప్రమేయం లేకుండా వరదలు సంభవించే ప్రాంతాలను గుర్తించే వీలుంది.
ఎలా పనిచేస్తుందంటే..?
హైదరాబాద్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను ముందస్తుగా అంచనా వేసి నివారణ చర్యలు చేపడితే ముంపు నుంచి బయటపడేందుకు వీలుంది. అందుకుగాను జీహెచ్‌ఎంసీ సహా వివిధ విభాగాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా 2000, 2006, 2016 అత్యధిక వర్షపాతం పడిన సమాచారం, వరదలు వచ్చిన ప్రాంతాల వివరాలు మెషిన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించారు. వర్షపాతం, ఉపరితల పరిస్థితులు, ఏటవాలు ప్రాంతం, వరదనాలా ప్రవాహాలకు దగ్గరగా ఉండటం, భూఉపరితల ఉష్ణోగ్రతలు, చెట్లు ఎక్కువగా ఉండటం తదితర అంశాలను కంప్యూటర్‌కు అందించారు. ఎగ్జిబూస్ట్ అల్గారిథమ్ (Exhibit algorithm)ను వినియోగించి అంచనా వేశారు. నగరాన్ని గ్రిడ్‌గా రూపొందించుకుని బేరీజు వేశారు. ప్రాంతాల వారీగా ఎంత వర్షపాతం పడింది..? మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో విశ్లేషించారు. ప్రతి ప్రాంతంలో వరదలు వచ్చే పరిస్థితిని అంచనా వేయగలిగారు. ఇలా వచ్చిన డేటాను గతేడాది వచ్చిన వరదలతో పోల్చి చూడగా కచ్చితత్వంతో విశ్లేషణ వచ్చింది. 2040, 2080 సంవత్సరాల్లో వరదల పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేస్తూ సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు మాధురి వివరించారు. ఈ పరిశోధన వివరాలు యూకేకు చెందిన ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ వాటర్ అండ్ క్లైమెట్ చేంజ్ సెప్టెంబరు సంచికలో ప్రచురితమయ్యాయి.