చెరువు, నది దగ్గరకు వెళ్లగానే అందులో షికారు చేయాలన్న సరదా ఉంటుంది. అక్కడే బోటింగ్ ఉంటే.. దాంతో పాటు నీళ్లలో మెల్లమెల్లగా కదిలే రెస్టారెంట్ ఉంటే.. నచ్చిన ఆహారం తింటూ... అలాఅలా ప్రయాణిస్తుంటే.. పర్యాటకులకు అదో మధురానుభూతి. అటు పర్యాటకుల్ని ఆకర్షించడంతో పాటు ఇటు పర్యావరణానికి హాని జరగని విధంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బోట్లు, ఎలక్ట్రిక్ ఫ్లోటింగ్ రెస్టారెంట్లను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తీసుకురాబోతోంది. టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. తొలుత దుర్గం చెరువు, హుస్సేన్‌సాగర్‌లలో బ్యాటరీ బోట్లు ప్రవేశపెట్టనుంది. దుర్గం చెరువులో ఫ్లోటింగ్ రెస్టారెంట్ రానుంది. ఆ తర్వాత రాష్ట్రంలో మరికొన్నిచోట్ల కూడా ఈ తరహా ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
దేశంలో తొలిసారి!
జలాశయాల్లో చిన్న, పెద్ద బోట్లు నడిచేందుకు ఇంధనంగా డీజిల్‌ను ఉపయోగిస్తారు. దీని వాడకం ద్వారా వెలువడే కాలుష్యం ఆ జలాశయాలపై ప్రభావం చూపుతుంది. కాలుష్య నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బోట్లు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లపై దృష్టిపెట్టింది. దుర్గం చెరువులో ఏర్పాటు చేసే ఫ్లోటింగ్ రెస్టారెంట్.. దేశంలో తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. 80 మంది కూర్చుని ప్రయాణించవచ్చు. ఇందులో వంటగదితో పాటు ఇతర ఏర్పాట్లు ఉంటాయి.