FLEXI WAR: హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వార్ రాజకీయాన్ని వేడెక్కించింది. వచ్చే నెల 2, 3 తేదీల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తోంది. 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ రెంటింటికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ జరుగుతున్న పరేడ్‌గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు సహా ముఖ్యమైన కూడళ్లను కమలనాథులు కాషాయపు జెండాలు, ఫ్లెక్సీలతో నింపేశారు. అయితే అధికార తెరాస సైతం ముఖ్య కూడళ్లు, బస్టాప్‌లలో తెరాస అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయం ముందు డిజిటల్ రూపంలో భాజపా హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. తెరాస పార్టీని ఉద్దేశించి 'సాలు దొర.. సెలవు దొర' అని అందులో పేర్కొంది. మరోపక్క టివోలి థియేటర్ సర్కిల్‌లో పేరు ప్రకటించని వ్యక్తులు 'సాలు మోదీ-సంపకు మోదీ' అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, రైతు చట్టాలు, అగ్నిపథ్ వంటి అంశాలపై ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కంటోన్మెంట్ సిబ్బంది వచ్చి.. మోదీ పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో ఫ్లెక్సీ వార్‌కు దారితీసింది.
జీహెచ్ఎంసీ జరిమానా..: ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో భారీగా వెలిసిన ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లపై ట్విట్టర్లో జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లపై ఒక పక్క ఫిర్యాదులు స్వీకరిస్తూనే.. ఈవీడీఎం విభాగం జరిమానాలు విధిస్తోంది. భాజపా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంట్ డౌన్ బోర్డుకి రూ.50 వేలు జరిమానా విధించారు. రసూల్‌పురాలో పెట్టిన ఫ్లెక్సీకి రూ.5 వేలు, బేగంపేట వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లకు రూ.17 వేలు, లక్డీకపూల్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, ఫ్లెక్సీలకు మొత్తం కలిపి రూ.25 వేలు జరిమానా విధించారు.
ఆ బ్యానర్లను తీసేయాలి.. భాజపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చలాన్లు వేయడాన్ని ఖండిస్తున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. కేటీఆర్, కేసీఆర్ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు సెలవులో ఉంటారని విమర్శించారు. రాష్ట్రంలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నందున ఇప్పటికే పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని.. మరికొన్ని పెట్టాల్సి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెరాస నేతలు తమ పార్టీకి ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు చోటులేకుండా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. తెరాస ఏర్పాటు చేసిన బ్యానర్లను తీసివేస్తే బాగుంటుందని.. తామే ఆ బ్యానర్లను చించివేసే వరకు చూడొద్దని హెచ్చరించారు.