శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో మధ్యతరగతికి సొంతింటి కల సుదూర స్వప్నంగానే మిగులుతోంది. కొనుగోలు సామర్థ్యం, ఇళ్ల ధరల మధ్య అంతరం ఏటేటా పెరుగుతూనే ఉంది. దూసుకెళుతున్న స్థిరాస్తి ధరలకు తోడు పెరిగిన పన్నులు, రిజిస్ట్రేషన్లు, మౌలికవసతుల అదనపు బాదుడు.. వెరసి మహానగరపాలిక పరిధిలో ఎటు వెళ్లినా రూ.40 లక్షలలోపు ఫ్లాట్ దొరికే పరిస్థితి కనిపించటం లేదు. హైదరాబాద్ చుట్టూ 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కనీసం రూ.అరకోటి పెడితే తప్ప 1000 చదరపు అడుగుల ఫ్లాట్ కొనలేని పరిస్థితి. నగరంలో అద్దెలకే 25-30 శాతం చెల్లిస్తున్న మధ్యతరగతి ఉద్యోగులు.. సొంతగూడు అమర్చుకుందామనుకున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో రూ.50 లక్షలలోపు ఖరీదైన ఇళ్లు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే హైదరాబాద్‌లోనే తక్కువ శాతం అమ్ముడైనట్లు లండన్‌కు చెందిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ నైట్‌ఫ్రాంక్ తాజా సర్వేలో వెల్లడైంది.
దేశంలోని పేరొందిన ప్రముఖ నగరాల్లో తాజా స్థితిగతులను అది వెలుగులోకి తెచ్చింది. 2014, 2015లో రూ.25 లక్షలలోపు ఫ్లాట్ల నిర్మాణం చేసేవారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లోనూ అవి దాదాపు 40 శాతం వరకూ రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలలోపు ఉండేవి. ప్రస్తుతం 750, 800 చ.అ. ఫ్లాట్ల నిర్మాణాన్ని బిల్డర్లు ఆపేశారు. తాజా అధ్యయనంలో అసలు రూ.35-40 లక్షల మధ్య పలికే ఫ్లాట్ల జోలికి నిర్మాణ సంస్థలు వెళ్లడంలేదని స్పష్టమైంది. మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్, నాచారం, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో సగటున చదరపు అడుగు ధర రూ.3,000 ఉండేది. కూకట్‌పల్లి, మదీనాగూడ ప్రాంతాల్లో రూ.3,500 నుంచి రూ.4,000 పలికేది. ఇప్పుడీ ధరలు హైదరాబాద్ నుంచి 10, 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేవు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కలా భూముల ధరలు దాదాపు ఒకేలా ఉండటం ఇందుకో కారణమని ప్రముఖ డెవలపర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆదర్శంగా సింగపూర్
సింగపూర్ ప్రజల్లో 80 శాతం మంది ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో ఉంటున్నారు. వీరిలో 93 శాతం మంది సొంతదారులు. ప్రపంచంలో అందుబాటులో ఇంటి సౌకర్యం(అఫర్డబుల్ హౌసింగ్) కలిగిన దేశంగా సింగపూర్‌కి గుర్తింపు ఉంది. అక్కడ ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు వివిధ ఆదాయ వర్గాలకు తగినట్లుగా వేర్వేరు సైజుల్లో ఇళ్ల నిర్మాణం చేస్తుంది. మొదటి ఇల్లు కొనేవారికి వడ్డీ రాయితీ, ప్రభుత్వ సబ్సిడీలు వర్తింపజేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే 9 లక్షల ఫ్లాట్‌లను నిర్మించి దేశవాసులకు అందజేసింది.
చైనాలో సబ్సిడీ రేట్లతో ప్రభుత్వ భూమి
ఆర్థిక సౌలభ్య గృహనిర్మాణ కార్యక్రమం కింద చైనా ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు సబ్సిడీ రేట్లతో భూమిని సమకూరుస్తోంది. అవి మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు నిర్మించి రాయితీ ధరలకు విక్రయిస్తాయి. నిర్మాణ వ్యయం, లాభాల పరిమితిని ప్రభుత్వం నిర్దేశిస్తుంది.