రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి పలుప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. ఛత్తీస్‌గఢ్‌పై ఉపరితల ఆవర్తనం కారణంగా... తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో గురువారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశమున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.
చినుకు పడితే చాలు నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది. మూడురోజుల నుంచి ఇదే పరిస్థితి. రోడ్డు దాటాలన్నా.. ఏదైన పనిమీద బయటకు పోవాలన్నా.. చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలియక.. నీటిలో పడిపోతున్నాము. మేము వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా... వర్షమొస్తే ఈ ఏరియా పరిస్థితి ఇలానే ఉంటుంది. అధికారులు దీనిని మంచిగా చేస్తారేమో అనుకున్న ప్రతిసారి మాకు నిరాశే మిగులుతుంది.
- స్థానికులు
బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లోని రెండు ఆర్డీసీ బస్ డిపోల సమీపంలోని కోర్టు, అగ్నిమాపక కేంద్రంలోకి భారీగా వరద వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతం కావడంతో హయత్‌నగర్ ఆర్టీసీ డిపో... చెరువును తలపిస్తోంది. దీనితో డిపోల నుంచి బస్సులు బయటకి తీయడానికి డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. డిపోలోని డీజిల్ బంక్ సగానికి పైగా మునిగిపోయింది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి వెళ్లడంతో... స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.