హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో 'అగ్రి-హబ్' ఆధ్వర్యంలో "ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్" పేరిట నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. వ్యవసాయ అంకుర కేంద్రాలు ప్రోత్సహించేందుకు గానూ.. "వ్యవసాయ-ఆహార వ్యవస్థల్లో అగ్రిటెక్ ఆవిష్కరణల ఆవిర్భావం" అన్న అంశంపై ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 'టీ-హబ్' రెండో విడత ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా యువతలో నవకల్పనలు ప్రోత్సహించేందుకు "ప్రీ-రన్" ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి ఈ "టార్చ్ రన్" రాజేంద్రనగర్ విశ్వ విద్యాలయానికి చేరుకుంది. వ్యవసాయ విద్యార్థులు ఈ కాగడాను ఉపకులపతి ప్రవీణ్‌రావుకు అందజేయగా.. ఆయన ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగేనేకర్కు అందించారు.
విద్యార్థులకు అవగాహన: పర్యావరణహిత వినూత్న ఆవిష్కరణలు, అంకుర కేంద్రాల సంస్కృతిపై శాస్త్రవేత్తలు ఈ సదస్సులో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంకుర కేంద్రాలు నెలకొల్పేందుకు యువత ముందుకొస్తే.. ఆహార గొలుసులో రైతుల ఉత్పత్తి, ఆదాయాలు పెంచేందుకు దోహదపడే అవకాశముంటుందని ఉపకులపతి ప్రవీణ్‌రావు తెలిపారు. ఉద్యోగం కోసం చూడకుండా అంకుర కేంద్రాలు నెలకొల్పి ఉద్యోగం, ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఉపకులపతి ప్రవీణ్‌రావు సూచించారు. తాజాగా ఆసక్తిగల పట్టభద్రులైన యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు "ది ఫ్లేమ్ అఫ్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్".. టార్చ్ రన్ కార్యక్రమం ఇప్పటికే 5 జిల్లాల్లో ముగిసింది. నేటితో ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పూర్తైంది.
విస్తృతంగా కార్యక్రమం: 2015లో ప్రారంభమైన టీ-హబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 1,100 పైగా అంకుర కేంద్రాలకు మంచి తోడ్పాటు ఇచ్చిన నేపథ్యంలో ఔత్సాహిక యువత, ఆవిష్కరణలు మరింత ప్రోత్సహించేందుకు రెండో దశ ప్రారంభం చేసుకోబోతోంది. ప్రభుత్వం లక్ష్యాలను విద్యార్థులు సహా చిన్నారుల్లో సైతం అవగాహన కల్పించేందుకు కార్యక్రమం విస్తృతంగా చేపట్టినట్లు టీ-హబ్ నిర్వాహకులు తెలిపారు.