మహా సముద్రాల్లో ప్రస్తుతం 150 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయని శాస్త్రవేత్తల అంచనా! ఏటా అయిదు నుంచి 13 టన్నుల వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి! వాటివల్ల సముద్రజీవుల ప్రాణాలకు ఎంతో ప్రమాదం. ఆ ముప్పునుంచి వాటిని తప్పించాలంటే.. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలి. ఆ నినాదంతోనే ఈ భారీ తిమింగలాన్ని ఏర్పాటుచేశారు.
ఎక్కడుందంటే..
బెల్జియంలోని బ్రూజెస్ నగరంలో ఉన్న ప్రధాన కాలువలో ఈ భారీ తిమింగలం బొమ్మ పెట్టారు. దీని కోసం పసిఫిక్ మహా సముద్రం నుంచి అయిదు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించి 38 అడుగుల ఎత్తయిన తిమింగలం బొమ్మ రూపొందించారు.
వీళ్ల చలవే..
‘స్టూడియో కేసీఏ’ ఒక ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ సంస్థ. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ కేంద్రంగా పనిచేస్తుంది. బ్రూజెస్ నగరపాలక సంస్థ పిలుపు మేరకు కేసీఏ తరఫున జాసన్ క్లిమోస్కి, లెస్లీ చాంగ్ ఈ పనిని చేపట్టారు.
వాళ్లేం చేశారంటే..
ఈ భారీ ప్లాస్టిక్ తిమింగలం కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హాంకర్లు, వంటింటి సామాన్లు, టాయిలెట్ షీట్ల నుంచి కార్ బంపర్ల వరకూ అయిదు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించారు. వాటిని న్యూయార్క్‌కి తరలించి శుభ్రం చేశారు. రంగుల వారీగా వేటికవి విభజించారు. తర్వాత ఉక్కు, అల్యూమినియం ఫ్రేమ్ వర్క్‌తో తిమింగలంలా చేశారు. ముందుగా ఈ ఆకృతిని రెండు భాగాలుగా బ్రూజెస్ నగరానికి తరలించి రెండింటినీ జతచేసి ప్రదర్శనకు ఉంచారు. తర్వాత ఈ బొమ్మను చాలా దేశాలకు తిప్పుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించండంటూ పిలుపునిచ్చారు.
ఎందుకిదంతా అంటే..
ఒక ప్లాస్టిక్ కప్పుని మనం నిర్లక్ష్యంగా కాలువలోకి విసిరేస్తాం. కానీ అది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాసముద్రాలను కలుషితం చేస్తుంది. ఆ విషయాన్ని గ్రహించి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని చెప్పడమే దీని ఉద్దేశం. ఈ తిమింగలాన్ని 2018లో ఏర్పాటు చేశారు. దీనికి కేసీఏ సంస్థ గౌరవ పురస్కారాన్నీ అందుకుంది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు