Chepa mandu in Hyderabad :మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఏడాది జూన్ 9వ తేదీన చేప ప్రసాదాన్ని బత్తిని బ్రదర్స్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నట్లు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి తలసానితో బత్తిన సోదరులు సమావేశమయ్యారు. చేపప్రసాదం పంపిణీ, ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.
Fish Prasadam in Hyderabad on June 9th : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఏటా చేప పంపిణీకి ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి లక్షలాది మంది వస్తారన్న మంత్రి.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఈ నెల 25 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని వివరించారు.
జూన్ 9 నుంచే చేప ప్రసాదం పంపిణీ : వచ్చే నెల తొమ్మిదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. సుమారు ఐదు లక్షల మంది ఈ ప్రసాదం కోసం వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మూడేళ్లు గ్యాప్ వచ్చినందున ఈ ఏడాది భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి తలసాని హామీ ఇచ్చారని చెప్పారు.