తెలంగాణ

telangana

ETV Bharat / state

Fish Ladder in Polavaram: పోలవరంలో జీవవైవిధ్యం.. ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తి - polavaram da,

Polavaram Project: దేశంలోని బృహత్తర ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరంలో ఓ ప్రత్యేక నిర్మాణం పూర్తైంది. ఫిష్ ల్యాడర్‌గా పిలిచే ఈ నిర్మాణం వల్ల గోదావరిలోని జీవజాలం, చేప జాతులు ఎగువ-దిగువ ప్రాంతాలకు స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఉంటుంది. వందల ఏళ్ల పాటు మనగలిగేలా చేపట్టిన ఈ నిర్మాణం జీవ వైవిధ్య పరంగానూ విభిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

fish
fish

By

Published : Jan 15, 2022, 12:07 PM IST

దేశంలోనే అతిపెద్ద కాంక్రీటు నిర్మాణమైన పోలవరం ప్రాజెక్టు జీవవైవిధ్య పరంగానూ ఉపకరించేలా గోదావరి నదిలోని చేపలు, ఇతర జీవజాలాలు ప్రాజెక్టుకు ఇరువైపులా స్వేచ్ఛగా తిరుగాడేలా నిర్మాణం పూర్తి అయ్యింది. స్పిల్ వే లోని రెండో స్థంభానికి అనుకుని నదిలోని జీవజాలం, చేపలు ఎగువకు, దిగువకు ప్రయాణించేలా చేపట్టిన నిర్మాణమే ఫిష్ ల్యాడర్. గోదావరిలో అదీ వరద సమయాల్లోనే అత్యంత అరుదుగా లభించే పులస చేపలు, ఇతర మత్స్య రకాల కోసం ఈ ఫిష్ ల్యాడర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 252 మీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫిష్ ల్యాడర్ నిర్మాణం నదీ ప్రవాహంతో పాటు నీటి మట్టం కనిష్టంగా ఉన్నా గరిష్టంగా ఉన్నా చేపలు, జీవజాతులూ అటూ ఇటూ తిరిగేందుకు వీలుగా నిర్మించారు. నాలుగు వెంట్ లు గా ఈ నిర్మాణం పూర్తి అయ్యింది.

చేపల రాకపోకలకు వీలుగా...

క్రస్ట్ లెవల్ స్థాయిలో 25 మీటర్ల వద్ద 1,2 వెంట్ లు, అలాగే 34 మీటర్ల ఎత్తులో మూడో వెంట్ , ఇక 41 మీటర్ల ఎత్తులో నాలుగో వెంట్ నిర్మాణం జరిగింది. క్రస్ట్ గేట్లు మూసి ఉన్నప్పటికీ ఈ వెంట్ ల గుండా నీటి ప్రవాహం మంద్రస్థాయిలోనే కొనసాగేలా ఏర్పాటు చేశారు. గోదావరిలో నీటి మట్టం అధికంగా ఉన్నా కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ చేపలు రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. చేపజాతిపై అధ్యయనం చేసి మానవ నిర్మిత కట్టడం నుంచి అటూ ఇటూ స్వేచ్ఛగా తిరిగేలా ఫిష్ ల్యాడర్ ఏర్పాటు అయ్యింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సెంట్రల్ ఫిషరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం నిర్వహించి స్పిల్ వేలోని రెండో స్పియర్ కు ఫిష్ ల్యాడర్ గేట్ ను అమర్చారు.

పులసకు ఇబ్బంది కలగకుండా...

పుస్తెలమ్మి అయినా పులస చేప తినాలన్న నానుడి గోదావరి జిల్లాలది. సముద్రం నుంచి ఎదురీదుతూ గోదావరి నదీ పాయల ద్వారా భద్రాచలం వరకూ ప్రయాణించే పులస చేపకు ఇబ్బంది లేకుండా ఈ తరహా నిర్మాణం చేపట్టినట్టు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి గోదావరికి వరదలు వచ్చి మంచి నీరు సముద్రంలో కలిసే సమయంలోనే ఇలస అనే చేప నదిలోకి ఎదురీదుతుంది. దీన్నే గోదావరి జిల్లాల వాసులు పులసగా అభివర్ణిస్తుంటారు. ఈ అరుదైన చేపలు అంతర్వేది నుంచి భద్రాచలం వరకూ ప్రవాహానికి ఎదురీదుతూ వెళ్లి సంతానోత్పత్తి చేస్తాయి.

జీవవైవిద్య పరంగా ఇంతటి కీలకమైన పరిణామ క్రమాన్ని ప్రాజెక్టు కాంక్రీటు నిర్మాణం అడ్డుకోకుండానే పర్యావరణ మంత్రిత్వశాఖ అధ్యయనం నిర్వహించి ఈ వెంట్ నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో పాటు స్పిల్ వే నిర్మాణంలో నీటి నిల్వ కారణంగానూ, దూరప్రాంతాల్లో వచ్చే చిన్నపాటి భూప్రకంపనాల వివరాలనూ నమోదు చేసేందుకు సెన్సార్ వ్యవస్థల్ని అంతర్గతంగానే ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:'ఈ పండక్కి పిండి వంటలు చేసే తీరికలేదా? అయితే మాకు చెప్పండి'

ABOUT THE AUTHOR

...view details