రాష్ట్రంలో పుష్కలమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ చేపట్టేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. అదేరోజు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని మత్స్య శాఖ కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖలపై తలసాని సమీక్ష నిర్వహించారు. పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకంలో భాగంగా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన జీవాలకు సంబంధించి బీమా పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై కంపెనీల ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లాల వారీగా అపరిష్కృతంగా ఉన్న భీమా చెల్లింపులపై చర్చించి వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో బీమా సొమ్ము చెల్లించకపోవడం వల్ల రైతులు నష్టపోతారని, ఒక నెల రోజుల్లో క్లెయిములన్నీ పరిష్కారం కావాలని సూచించారు.
రాష్ట్రంలో 24 వేల చెరువులు, రిజర్వాయర్లలో 50 కోట్ల రూపాయల వ్యయంతో 81 కోట్ల చేప పిల్లలు, 78 నీటి వనరులలో 10 కోట్ల రూపాయల ఖర్చుతో 5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలు విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో చేపపిల్లల విడుదల కార్యక్రమంలో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మత్స్య సహకార సంఘాల సభ్యులు పాల్గొంటారని.. ఆ సమయంలో 25 మంది సభ్యులకు మించి లేకుండా చూడటం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
జీవాలు, పాడి గేదెల పంపిణీ రెండవ విడత త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొవిడ్-19 నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం దృష్ట్యా పెద్ద ఎత్తున జీవాల పశు సంవర్ధక శాఖ వాక్సినేషన్, డీవార్మింగ్ చేపడుతున్నది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ అనుబంధ పాడి రంగం బలోపేతం కోసం పాల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడంమే కాక విజయ డెయిరీ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు టీఎస్ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు త్వరలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మామిడిపల్లిలో మెగా డెయిరీ నెలకొల్పేందుకు త్వరలోనే భూమి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నాలుగయిదేళ్లుగా ఉచిత చేప పిల్లల పంపిణీ వల్ల మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయాలనే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. రాష్ట్రం నుంచి చేపలను ఎగుమతి చేసే స్థాయికి మత్స్య రంగం అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒకటి చొప్పున 150 సంచార చేపల విక్రయ కేంద్రాలు రాయితీపై అందజేయనున్నందున త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి తలసాని ప్రకటించారు.
ఆగస్టు 1 నుండి 2021 మే వరకు పశువులకు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం కొనసాగనుంది. ప్రస్తుతం కరీంనగర్ కేంద్రంలో మాత్రమే పశువీర్య ఉత్పత్తి జరుగుతుండగా... త్వరలో కంసానిపల్లి కేంద్రం సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. మేలుజాతి పశుసంపద అభివృద్ధి కోసం చేపట్టిన కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇది రాష్ట్రానికి గర్వకారణమని పశు సంవర్ధక శాఖ తెలిపింది.
ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్