First forest university in telangana తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది. అటవీ విద్య, పరిశోధన, విస్తరణ కోసం ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలని.. దాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్చనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అటవీశాస్త్ర విశ్వవిద్యాలయం చట్టం 2022కు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. అటవీ వనరుల పరిరక్షణ, సుస్థిర నిర్వహణ కోసం అర్హులైన అటవీ వృత్తి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
పారిశ్రామిక, గృహ అవసరాల నుంచి వచ్చే డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు తోట పంటల ద్వారా ఉత్పత్తి చేసేలా తగిన పద్ధతుల అభివృద్ధి, పరిశోధనకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. సంప్రదాయక అటవీ వ్యవసాయంతో పాటు సహజసిద్ధమైన అడవులపై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా వివిధ వ్యవసాయ, జీవావరణ పరిస్థితులకు అనుకూలమైన అటవీ వ్యవసాయ నమూనాలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.