జీఎంఆర్ ఎయిర్ కార్గోతో టీఎస్ఆర్టీసీ కార్గో బస్ ఫీడర్ సర్వీస్ (బీ.ఎఫ్.ఎస్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ.. జీఎంఆర్ హైదరాబాద్ ఎం.ఓ.యూపై సంతకం చేశారు. ఎయిర్ కార్గో మొదటి ఫీడర్ సర్వీస్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభించారు.
ఎగుమతులు, దిగుమతులు
హైదరాబాద్ నుంచి ఫార్మా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుతుమతి అవుతున్నాయని మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ ఒప్పందంతో ఎగుమతులు, దిగుమతులు, కార్గో ఫస్ట్ మైల్, చివరి మైల్ బస్ ఫీడర్ సేవల ద్వారా సంస్థ అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతి, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు తదితర వాటిని ఎగుమతి చేసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. విమానాశ్రయంలోకి వచ్చే అంతర్జాతీయ దిగుమతులను ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చేరవేయడమే కాకుండా ఇతర దేశాలైన యూఎస్, ఈయూ, ఆఫ్రికా, మిడిల్-ఈస్టర్న్, ఫార్-ఈస్టర్న్ దేశాలకు ఎగుమతులు, దిగుమతులు సకాలంలో కొనసాగించవచ్చని పేర్కొన్నారు.