వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన తర్వాత నిన్న మొదటి రోజు ఏలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగింది. సాధారణ రోజుల్లో జరిగిన విధంగానే విలువలు పెరిగిన తర్వాత కూడా జనం నుంచి ఎలాంటి వ్యతిరేకత కనిపించకుండా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. విలువలు పెరుగుతాయని తెలియగానే... రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు తరలివచ్చారు.
రెండు రోజుల్లో...
సోమవారం మొత్తం 7,539 డ్యాకుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా... రూ.72.82 కోట్లు రాబడి వచ్చింది. సాధారణంగా మంగళవారం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చాలా తక్కువ. కానీ విలువలు పెరుగుతాయని చెప్పడంతో రిజిస్ట్రేషన్ల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు. అలా 6,504 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి ప్రభుత్వానికి 60.94 కోట్ల రాబడి చేకూరింది.
విలువలు పెరిగిన మొదటి రోజు...
భూముల విలువలు పెరిగిన మొదటి రోజు మొత్తం 7,884 రిజిస్ట్రేషన్లు జరిగి తద్వారా రూ.29 కోట్లు రాబడి వచ్చింది. పెరిగిన మార్కెట్ విలువలు, 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీల మేరకు బుధవారం రాత్రేే సాఫ్ట్వేర్ను అనుసంధానం చేశారు. అందువల్ల గురువారం ఎలాంటి సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు రూ.1990.63 కోట్ల రాబడి..
జులై నెలలో ఇప్పటి వరకు 74,722 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యి రూ.639.40 కోట్లు ఆదాయం చేకూరింది. అంటే ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కరోనా ప్రభావంతో కొన్ని రోజులు రిజిస్ట్రేషన్లు జరగకపోయినా ఆ తర్వాత క్రమంగా రిజిస్ట్రేషన్లు వేగం పుంజుకున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు 86,070 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి 729.34 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు 3,11,547 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి రూ.2,080.60 కోట్లు మేర ప్రభుత్వానికి రాబడి వచ్చినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:cm kcr: 'ప్రజా రక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి'