హైదరాబాద్ కూకట్‌పల్లిలో పట్టపగలు దోపిడీ దొంగల హల్‌చల్‌తో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏటీఎంలో డబ్బు నింపడానికి వచ్చిన వాహనాన్ని అనుసరించి.. ఏటీఎం కేంద్రంలో చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. చేతికందిన రూ.5 లక్షల నగదు దోచుకొని పరారయ్యారు. వారిని నిలువరించే క్రమంలో విశ్రాంత సైనిక ఉద్యోగి అలీ మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కాల్పులకు తెగబడ్డ దుండగులు అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. నిందితులు వాడినది నాటు తుపాకీగా గుర్తించారు. ఘటనా స్థలంలో శిరస్త్రాణం, తుపాకీ మ్యాగ్‌జైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పల్సర్ వాడినట్టు.. వారు మియాపూర్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. సరిహద్దు చెక్‌పోస్టులతో పాటు నగరం నలువైపులా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో కూకట్పల్లి దోపిడీ దొంగలు? - KUKATPALLY FIRING
హైదరాబాద్‌లో సంచలనం రేపిన దోపిడీ దొంగల ముఠా కాల్పుల కేసును సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానిస్తున్న పోలీసులు.. పక్కా పథకం ప్రకారమే దొంగలు రెక్కీ నిర్వహించి కాల్పులు జరిపి దోపిడీ చేసినట్టు గుర్తించారు. మరోవైపు సంగారెడ్డి వద్ద అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
FIRING AT KUKATPALLY
మరోవైపు దోపిడీ దొంగలను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దోపిడీ అనంతరం నాందేడ్ పారిపోతుండగా సంగారెడ్డిలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
Last Updated : Apr 30, 2021, 4:45 AM IST