Fire Week In Telangana: అగ్నిమాపకశాఖ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు.. 900లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అవగాహనతో పాటు ప్రమాద నివారణ చర్యలను అధికారులు వివరించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో.. అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 14నే ఎందుకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారంటే: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటారు. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యుద్ధ ఓడలో కాటన్, బంగారం, మందుగుండు సామగ్రి, 1400 టన్నుల మిశ్రమ సరకును తీసుకువెళుతున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో 66 మంది మృత్యువాత పడ్డారు. చనిపోయిన సిబ్బంది త్యాగాన్ని స్మరించుకోవడానికి.. ఏప్రిల్ 14న అగ్నిమాపక దినోత్సవంగా పాటించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు: అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా వివిధ రకాల అగ్నిప్రమాదాలపై.. అధికారులు ప్రజలకు అవగహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎత్తైన భవనాలు, షాపింగ్ మాల్‌లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ కాంప్లెక్స్, పరిశ్రమలలో అగ్నిప్రమాదంపై అవగాహనతో పాటు ప్రమాద సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షణ ఇచ్చారు. పెట్రోల్ బంకులు, వంట గ్యాస్ నిల్వ ఉండే గోడౌన్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, నివాస కాలనీల్లో ఎల్పీజీ భద్రత, విద్యుత్ అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు.