అటవీ ప్రాంతాల్లో అగ్గి మంటలు ఆరడం లేదు. వేసవి పెరిగేకొద్ది అగ్నిజ్వాలల్లో అడవి దహించుకుపోతుంది. 13వ తేదీన ఈ ఏడాదిలోనే అత్యధిక సంఖ్యలో 48 ప్రాంతాల్లో అడవులు కాలిపోయాయి. 18న ఈ సంఖ్య ఏకంగా ఐదున్నర రెట్లకుపైగా పెరిగింది. బుధవారం ఒక్కరోజు 301 చోట్ల అడవులు కాలిపోవడం వల్ల అటవీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. పగలే కాకుండా ఇటీవలికాలంలో రాత్రి సమయంలోనూ అడవికి అగ్గి అంటుకుంటోంది. దీంతో రాత్రి సమయాల్లో ఆ ప్రాంతాలకు చేరుకోవడం, నిప్పుఆర్పడం క్షేత్రస్థాయి సిబ్బందికి చాలా కష్టంగా మారుతోంది.
పర్యావరణానికి తీరని నష్టం
అడవుల్లో అగ్నిప్రమాదాల కారణంగా అటవీ సంపదతోపాటు పర్యావరణానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లుతోంది. వన్యప్రాణులు ఆవాసం కోల్పోవడం, మంటలతో విషవాయువులు రావడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ఏడు భారీ అగ్ని ప్రమాదాల్లో ఒక్కోచోట కనీసం 10 హెక్టార్ల అడవి కాలినట్లు అంచనా.
ఉపగ్రహ పరిజ్ఞానం
అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ప్రధానంగా జనవరి-జూన్ వరకు జరుగుతాయి. చెట్ల నుంచి ఆకులు రాలడం ఫిబ్రవరిలో ఎక్కువ ఉంటుంది. మార్చి కల్లా నేలపై ఎండిన ఆకులు ఎక్కువగా ఉంటాయి. ఏ కొంచెం నిప్పురవ్వలు పడ్డా అడవి అంటుకుంటుంది. గడిచిన ఐదేళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే 56.7శాతం వరకు ఒక్క మార్చి మాసంలోనే చోటుచేసుకున్నాయి. మంటలపై ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారంతో అటవీశాఖ అప్రమత్తం అవుతూ నియంత్రణ చర్యలు చేపడుతుంది.ఎస్‌ఎన్‌పీపీ ఉపగ్రహం ప్రతి 375 మీటర్ల ప్రాంతానికి ఓ చిత్రం తీస్తుంది. కిలోమీటర్ మేర అగ్ని ప్రమాదం విస్తరిస్తే, ఒక ప్రమాదాన్ని మూడుగా చూపిస్తుంది.