Fire Accident in Nampally Today : చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే దీపావళి.. వారి కుటుంబాల్లో కారు చీకట్లు నింపింది. దివ్వెల వెలుతురు, టపాసుల మోతతో సందడి నెలకొనే వేళ.. ఆ ప్రాంతం ఆర్తనాదాలతో మార్మోగింది. ఎక్కడ చిచ్చు రేగిందో తెలియలేదు.. ఎలా అంటుకుందో అంతుపట్టలేదు. కళ్లుమూసి తెరిచేలోగా.. కారుచీకటి అలుముకుంది. సాయం కోసం పిలిచేలోగా.. ఊపిరే ఆగిపోయింది. పై అంతస్తు నుంచి బయటికి రాలేక కొందరు.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీస్తూ మరికొందరు.. అత్యంత దయనీయస్థితిలో సజీవ దహనమయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలో(Fire Accident in Bazar Ghat) జరిగిన ఘోర అగ్నిప్రమాదం.. 9మందిని బలితీసుకుంది. గాయపడిన మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Massive Fire Accident Nampally :హైదరాబాద్ మహానగరం మరోసారి ఉలిక్కిపడింది. గతేడాది రూబీ హోటల్, ఈ ఏడాది ఆరంభంలో దక్కన్ మాల్, మార్చిలో స్వప్నలోక్ ఉదంతాలు మరువకముందే.. నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి వేడుకల వేళ.. బజార్ ఘాట్ కాలనీలో పిల్లలు కేరింతలు కొడుతున్నారు. మిగిలిపోయిన బాణాసంచా కాల్చుతూ ఆటలాడుతున్నారు. ఈ సమయంలోనే అపార్ట్‌మెంట్‌లో చిన్నపాటి నిప్పు రవ్వ రేగింది. మంటలు చిన్నవే అనుకున్న కాలనీవాసులు.. నీళ్లు చల్లి వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ చిన్నపాటి మంటే పక్కనే ఉన్న రసాయన గోదాములోకి వ్యాపించాయి. అంతకంతకూ వ్యాప్తిచెంది. అపార్ట్‌మెంట్ పై అంతస్తులకు అంటుకున్నాయి.
పొగ వస్తుండటంతో పైన ఉన్న వాళ్లంతా తలుపులు మూసి, లోపలే ఉండిపోయారు. ఈ క్రమంలోనే మంటలు ఎక్కువవడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు మెట్ల ద్వారా కిందికి వస్తూ.. మంటల ధాటికి సజీవదహనమయ్యారు. మరో కుటుంబానికి చెందిన ఆరుగురు ఇంట్లోనే ఉండిపోయి.. పొగ కమ్మేసి, ఊపిరాడక చనిపోయారు.
దీపావళి ఎఫెక్ట్ - హైదరాబాద్‌లో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు, ఒకరి మృతి, భారీగా ఆస్తి నష్టం
Nine Killed in Fire at Nampally in Hyderabad : పెద్దఎత్తున ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది మంటలను అదుపుచేసి అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన 9 మంది మృతదేహాలను బయటికి తీసుకువచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరో 2 ఇళ్లకు చెందిన 8 మందిని కిందికి తీసుకువచ్చారు. చనిపోయిన వారిలో మహ్మద్ ఆజాం, ఆయన భార్య రెహానా సుల్తానా, కుమార్తెలు ఫైజా సమీన్, బీడీఎస్ డాక్టర్ తహూరా ఫర్హీన్, ఆమె పిల్లలు తూభ, తరూబా ఉన్నారు. అలాగే మరో కుటుంబానికి చెందిన జాకీర్ హుస్సేన్, ఆయన భార్య నికత్ సుల్తానా, వారి కుమారుడు హసీబ్ -ఉర్ -రెహమాన్ ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు.. గాయపడిన వారికి అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రమేశ్ జైస్మాల్ అనే భవన యజమాని కొన్నెళ్లుగా తన ఇంట్లో రసాయనాల గోదాము నిర్వహిస్తున్నాడు. కూలర్ల డబ్బాలతో పాటు.. గేట్లకు బిగించే షీట్లను తయారు చేసేందుకు ఈ రసాయనాలను ఉపయోగిస్తారు. కెమికల్స్‌తో పాటు ఇతర ముడిసరుకులను గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న గోదాములో ఉంచాడు. పైనున్న 4 అంతస్తులను అద్దెకు ఇచ్చి.. ఇంటికి సమీపంలోనే శ్రీబాలాజీ ఎంటర్‌ప్రెజెస్ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. రసాయనాలు కావాల్సిన వాళ్లు ఎవరైనా దుకాణానికి వస్తే.. గోదాములో ఉన్న డ్రముల్లోంచి డబ్బాలు నింపి, దుకాణం వద్దకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే గతేడాది ఇదే ఇంట్లో రసాయనాలు పడి వాచ్‌మెన్ కుమార్తెకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు.
Nampally Fire accident News : తాజాగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్రత పెరిగి.. 9 మంది చనిపోవడానికి ఈ రసాయనాలే కారణమని తేలింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది నీళ్లు చల్లితే.. రసాయనాల్లో కలిసి రహదారి మొత్తం జిడ్డు జిడ్డుగా మారింది. సహాయక చర్యలు చేపట్టే జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు.. పలువురు మీడియా ప్రతినిధులు జారి కిందపడిపోయారు. రహదారి మొత్తం రసాయనాలతోనే నిండిపోయింది. దాదాపు 50 డ్రమ్ములకు పైగా రసాయనాల డ్రమ్ములను గోదాములో నుంచి బయట పడేశారు. ఆ డ్రమ్ములకు మంటలు వ్యాపించి ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించే ప్రమాదముండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవనం కింద రసాయన గోదాము నిర్వహిస్తూ పైన అద్దెకిచ్చినట్టు పలుమార్లు ఫిర్యాదుచేసినా.. అధికారులెవరూ పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోతున్నారు.
సికింద్రాబాద్ లో గత ఏడాది సెప్టెంబర్‌లో రూబీ హోటల్ ఘటన, ఈ ఏడాది జనవరిలో దక్కన్ మాల్ , మార్చిలో స్వప్నలోక్ అగ్నిప్రమాదాలు తీవ్రవిషాదాలను మిగిల్చాయి. ఈ 3 ఘటనల్లో 29 మంది దుర్మరణం చెందగా.. తాజాగా అదే తరహాలో నాంపల్లిలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో.. 9 మంది ప్రాణాలు కోల్పోవటం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వ్యవహారాలపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.
Fire Accident in Sangareddy : సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన రియాక్టర్లు
హైదరాబాద్‌లో గ్యాస్ పైప్‌లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు