Fire accident in Hyderabad : హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి కమల ప్రసన్న నగర్లో ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నివాసముండే జయకృష్ణ(32) మరణించాడు. యువకుడి ఇంట్లో నుంచి మంటలు చెలరేగడం చూసి అక్కడి స్థానికులు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది అని వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ జరిగింది: స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. జయకృష్ణ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన వ్యక్తి. గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. నాలుగు నెలలుగా స్థానికంగా జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. తన భార్య, పిల్లలను తన సొంత ప్రాంతమైన భీమవరంలో ఉంచాడు. ప్రస్తుతం ఇంకో వ్యక్తితో పాటు రూమ్‌లో ఉంటున్నాడు. తనతో పాటు ఉన్న సదరు వ్యక్తి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొదటి అంతస్తులోని జయకృష్ణ గది నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను చూసి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ డిపార్డ్మెంట్కు సమాచారం అందించి మంటలను ఆర్పేశారు. లోపలికి వెళ్లి చూసే సరికి జయకృష్ణ మంటల్లో కాలి మృతిచెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతుడు అధికంగా మద్యం సేవించే వాడని అతని బంధువులు తెలిపారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడా లేక అగ్నిప్రమాదం వల్ల ఇలా జరిగిందా అనే విషయాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.