Fire Accident at Gudimalkapur in Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకుర ఆసుపత్రి(Ankura Hospital)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పేశారు. అనంతరం అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు ప్రమాదంపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది.
మంటలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కొంతమంది పేషంట్లను బయటకు పంపించేశారు. ఘటనాస్థలానికి చేరుకొని సౌత్‌జోన్ డీసీపీ సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం(Fire Accident)లో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిపైన ఉన్న బోర్డు, ఆసుపత్రికి ఉన్న ఫ్లెక్సీలు షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయి మంటలకు కారణమై ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉండే ప్రజానీకం భయాందోళనలకు గురయ్యారు.
విచారణకు ఆదేశం : అంకుర ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీహెచ్‌లు విచారించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాలు జారీ చేశారు.